Weather Update: వరుసగా రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
Weather Update
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో రాబోయే రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయి. దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో కేంద్రీకృతమైంది. ఈ వాతావరణ ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు రోజులు ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఆకాశం రోజంతా మేఘావృతమై ఉండి, పలు చోట్ల వర్షాలు దంచికొట్టే అవకాశం ఉంది. రాబోయే వారం చివరికి వర్షాలు కాస్త తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వర్షపాతం.. హైదరాబాద్ వాతావరణం
తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు దక్షిణ తెలంగాణ పరిధిలోని ప్రధాన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్ష తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్ష సూచన
అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్ర తీరం వెంబడి ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, స్థానిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మత్స్యకారులకు జాగ్రత్తలు
ఉత్తర కోస్తా పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడవచ్చు. తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహా బయటకు రావద్దని, వర్షం పడే సమయంలో పెద్ద చెట్ల కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.




