Weather Update : నైరుతీ రుతుపవనాల రాకపై ఐఎండి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎప్పుడంటే?
Weather Update : నైరుతీ రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఐఎండి వెల్లడించింది. మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Update
Weather Update : వేసవి ఎండలతో అల్లాడిపోతున్న సామాన్యులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతీ రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించేందుకు అడుగులు వేస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మీదుగా ఇవి ప్రవేశించడానికి వాతావరణం అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వారం చివరి నాటికి అండమాన్ దీవులను రుతుపవనాలు తాకనున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత తగ్గి, వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం శ్రీలంకకు ఉత్తరం వైపున బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలంగా మారే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. దీని ప్రభావంతో సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఈ అల్పపీడనం ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం వైపు కదులుతోంది. ఇది ఎంత శక్తివంతంగా ఉందంటే.. అరేబియా సముద్రం వైపు నుంచి వచ్చే గాలులను కూడా తన వైపు లాగేసుకుంటోంది. దీంతో రుతుపవనాల కదలిక మరింత వేగవంతం అయ్యేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మే 12 నుంచి 15 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతం, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రాయలసీమలో మే 14, 15 తేదీల్లో, తెలంగాణలో మే 12న ఉరుములతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉంది. వర్షాలు భారీగా ఉండకపోయినా, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుత ఎండల పరిస్థితి ఇదే
వర్ష సూచన ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఎండల తీవ్రత తగ్గలేదు. మే 12న తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 39 నుంచి41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా రాయలసీమలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కేరళను ఎప్పుడు తాకుతాయి?
తాజా అంచనాల ప్రకారం.. మే 20వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చు. కేరళకు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఇవి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈసారి భూమధ్య రేఖ వద్ద పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అంటార్కిటికా వైపు నుంచి వచ్చే గాలులు కూడా వేగాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్ నినో ప్రభావం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.




