Telugu Language Day 2026 : తెలుగు భాష గొప్పదనం...గిడుగు వేసిన బాటలు తీయదనం
తెలుగు భాషా దినోత్సవం 2026 సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి జీవిత విశేషాలు, వ్యవహారిక భాషా ఉద్యమం, సవర భాషపై పరిశోధనలు, తెలుగు భాషకు ఆయన చేసిన సేవల గురించి తెలుసుకుందాం.
Telugu Language Day 2026 : మాతృభాషా వికాసానికి, ప్రజా భాషా చైతన్యానికి మూలస్తంభంగా నిలిచిన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి. పండితుల గూడు దాటి సామాన్య మానవుని పెదవులపై భాసించే వాడుక భాషకు శాస్త్రీయ గుర్తింపు తెచ్చిన భాషా వైతాళికుడు ఆయన. గిడుగు రామమూర్తి పంతులు జయంతి అయిన ఆగస్టు 29వ తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ‘తెలుగు భాషా దినోత్సవం’గా అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. వ్యావహారిక భాషా ఉద్యమం ద్వారా ఆయన వేసిన బాటలు, భాషకు చేకూర్చిన తీయదనం, సవర గిరిజనుల విద్యాభివృద్ధికి చేసిన సేవలు భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ మహనీయుని జీవిత విశేషాలు, తెలుగు భాషా దినోత్సవ ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం.
గిడుగు ప్రారంభ జీవితం
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీన నాటి గంజాం జిల్లా, నేటి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, 1911 వరకు విద్యారంగంలో సేవలు అందించారు. అనంతరం 1911 నుండి 1936 వరకు ఆంధ్రదేశమంతటా పర్యటిస్తూ భాషా పరిశోధనలు కొనసాగించారు. 1936లో పర్లాకిమిడి ఒరిస్సాలో కలవడంతో నిరసనగా రాజమండ్రి వచ్చి తన కడపటి రోజులు గడిపారు.
సవర గిరిజన భాషా వికాసం ... మొదటి భాషావేత్త
గిడుగు రామమూర్తి కృషి కేవలం తెలుగు భాషకే పరిమితం కాలేదు. పర్లాకిమిడి ప్రాంతంలోని సవర గిరిజనుల విద్యాభివృద్ధి కోసం 1892లో సవర భాషను నేర్చుకోవడం ప్రారంభించారు. 1894లో మద్రాసు గవర్నరుకు గిరిజన విద్యపై నివేదిక సమర్పించారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో 1913 నాటికి స్వయంగా సవర భాషా మాధ్యమంలో పాఠశాల తెరిచి వాచకాలు రూపొందించారు. 1931లో 'మాన్యువల్ ఆఫ్ సోర లాంగ్వేజ్', 1933లో 'ఇంగ్లీష్-సోర నిఘంటువు' ప్రచురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ భాషాశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.
వ్యావహారిక భాషా ఉద్యమం ... ప్రజా చైతన్యం
అప్పటివరకు పాఠశాలల్లోనూ, సాహిత్య వ్యవస్థలోనూ ఉన్న జీవరహితమైన కృతక గ్రాంథిక భాషను వ్యతిరేకిస్తూ, ప్రజలు మాట్లాడే 'శిష్ట వ్యావహారికం'లోనే విద్యాబోధన జరగాలని గిడుగు ఉద్యమించారు. పండితుల విమర్శలను తిప్పికొడుతూ 'బాలకవి శరణ్యము', 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము', 'గద్యచింతామణి' వంటి ప్రామాణిక గ్రంథాలను వెలువరించారు. 1912లో ఏ మెమోరండం ఆఫ్ మోడ్రన్ తెలుగును బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించి వాడుక భాషా విశిష్టతను నిరూపించారు. వీరి పోరాటం ఫలితంగానే నేడు ప్రసార సాధనాలలో, విద్యావ్యవస్థలో, నిత్య జీవితంలో సరళమైన తెలుగు భాష అందుబాటులోకి వచ్చింది.
తెలుగు భాషా వైభవం ... దినోత్సవ విశేషాలు
అమరకోశ ధ్వనులతో, అచ్చెరువొందించే తీయదనంతో నిండిన తెలుగు భాషను పాశ్చాత్యులు 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని కొనియాడారు. ప్రపంచంలో 7.5 కోట్లకు పైగా ప్రజలు మాట్లాడే ఈ భాష భారతదేశంలోని 6 ప్రాచీన భాషలలో ఒకటిగా వెలుగొందుతోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భాషా సేవకులకు ప్రత్యేక నిధులు, అవార్డులు ప్రధానం చేస్తారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావులతో పాటు ఆధునిక సాహిత్య వైతాళికుడిగా నిలిచిన గిడుగు వెంకట రామమూర్తి గారు కేవలం భాషావేత్త మాత్రమే గాక శాసన, చరిత్ర పరిశోధకుడిగా కూడా సేవలు అందించారు. నిత్య జీవితంలో మన నోట పలికే సరళమైన ప్రతి తెలుగు మాట వెనుక గిడుగు రామమూర్తి దశాబ్దాలనాటి త్యాగం దాగి ఉంది.




