Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. పగలు సెగలు.. సాయంత్రం వానలు.. వచ్చే 48 గంటలు గండమే?
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. మరోవైపు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక పట్టాన అర్థం కావడం లేదు. పొద్దున లేచినప్పటి నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుంటే, సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా సీన్ మారిపోతోంది. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వింత వాతావరణంపై అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఇటు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేశాయి. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఎల్లో అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు భాగ్యనగరంలో కూడా వానలు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గాలి వాన బీభత్సం సృష్టించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఏపీలో పిడుగుల భయం
ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణం ప్రతికూలంగా మారనుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, ఉరుములు మొదలవ్వగానే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగుల ముప్పు ఎక్కువగా ఉన్నందున విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
47 డిగ్రీలకు టెంపరేచర్
ఒకవైపు వానలు పడుతున్నా, మరోవైపు ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో భానుడు సెగలు కక్కనున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే మూడో వారంలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని, వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
రుతుపవనాల రాక ఎప్పుడు?
అందరూ ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 15 నాటికే రుతుపవనాలు అండమాన్ దీవులను తాకనున్నాయి. ఆ తర్వాత జూన్ 1న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇవి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టనుంది. అప్పటివరకు ఈ వింత వాతావరణం, ఆకస్మిక వర్షాలు కొనసాగుతూనే ఉంటాయని అధికారులు వివరించారు.




