Markapuram: భూ కబ్జాదారుల బరితెగింపు.. పోలీసులకు అప్పగించిన బాధితులు
Markapuram: మార్కాపురం కలెక్టరేట్ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది.
Markapuram: భూ కబ్జాదారుల బరితెగింపు.. పోలీసులకు అప్పగించిన బాధితులు
Markapuram: మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కలెక్టరేట్ సమీపంలోని పోలేరమ్మ గుడి వద్ద భూ వివాదం ఉద్రిక్తంగా మారింది.సర్వే నంబర్-1లో ఉన్న సుమారు 240 ప్లాట్లకు సంబంధించిన భూమిపై కబ్జా యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు.
ప్లాట్లలో రాళ్లు తొలగించి చదును చేస్తున్న వ్యక్తులను పట్టుకున్న బాధితులు, వారిని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కబ్జాదారులపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. నకిలీ పత్రాలు సృష్టించి సుమారు 11 ఎకరాల విలువైన భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారని బాధితులు తెలిపారు. భూమి విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, తమపై బాంబులు వేస్తామని కబ్జాదారులు బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.బాధితులను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో మార్కాపురం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




