Chandrababu: తిరుమలలో శ్రీవారి స్మరణే తప్ప మరొకటి వినపడకూడదు

Chandrababu: తిరుమలలో పవిత్ర భావం ఉట్టిపడాలని, ఇది రాజకీయాలకు వేదిక కాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 3:57 PM IST
Chandrababu
X

Chandrababu: తిరుమలలో శ్రీవారి స్మరణే తప్ప మరొకటి వినపడకూడదు

Chandrababu: తిరుమలలో రెండో రోజు పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారి భక్తుడిగా తాను చేపట్టిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. 1999లో తాను ప్రారంభించిన మ్యూజియాన్ని ఇవాళ ఆధునికీకరించామని, వేంకటేశ్వరస్వామి చరిత్ర భక్తులందరికీ సులభంగా అర్థమయ్యేలా దీనిని తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన ట్రస్టును ఆయన అభినందించారు.

రాబోయే ఐదేళ్ల పాటు మ్యూజియం నిర్వహణ బాధ్యతలను సదరు ట్రస్టుకే అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి రక్షణ కల్పించేలా ఎల్‌ఐసీ (LIC) ద్వారా రూ.2 లక్షల ఉచిత బీమా అందిస్తున్నామని, దీనికోసం ఆధార్ ఆధారిత పేపర్‌లెస్ క్లెయిమ్ విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు.

తిరుమల ప్రాంతం అత్యంత పవిత్రంగా ఉండాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు వేదిక కాకూడదని పేర్కొన్నారు. ఇక్కడ శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణ తప్ప వేరేది వినపడకూడదని, భక్తులు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో కొత్తగా 32 ఎలక్ట్రిక్ (EV) బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఇందులో రిలయన్స్ సంస్థ 25, భారత్ బయోటెక్ సంస్థ 7 బస్సులను విరాళంగా అందించాయని, సేవాభావంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని చెప్పారు.

ఇప్పటికే సుమారు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో వివిధ రంగాలకు చెందిన వైద్య, విద్యా నిపుణులు కూడా సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.