Tirupati: మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం.. నిందితుడైన జీఎస్‌టీ అధికారి, డిప్యూటీ తహసిల్దార్ భార్య అరెస్ట్!

Tirupati: తిరుపతిలో దారుణం జరిగింది. వేసవి సెలవులకు పిన్ని ఇంటికి వచ్చిన మైనర్ బాలికపై బాబాయ్ వరుసైన వ్యక్తి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Arun Chilukuri
Published on: 23 May 2026 1:40 PM IST
Tirupati
X

Tirupati: మైనర్ బాలికపై బాబాయ్ అఘాయిత్యం.. నిందితుడైన జీఎస్‌టీ అధికారి, డిప్యూటీ తహసిల్దార్ భార్య అరెస్ట్!

Tirupati: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని పిన్ని ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తితో పాటు, భర్త నేరాన్ని కప్పిపుచ్చి అతడికి సహకరించిన భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కావడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసు ఈ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.

పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన రామ్మూర్తి స్థానిక జీఎస్‌టీ (GST) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య మానస రైల్వే కోడూరు తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్‌గా విధులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఉంటున్న మానస అక్క కూతురు (మైనర్ బాలిక) వేసవి సెలవులు కావడంతో తిరుపతి లక్ష్మీపురంలోని పిన్ని ఇంటికి వచ్చింది. బాలికపై కన్నేసిన రామ్మూర్తి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాలిక న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు.

తిరుపతి నుంచి హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లిన బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి.. గట్టిగా నిలదీయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో షాక్‌కు గురైన తల్లి వెంటనే సైబరాబాద్‌ పరిధిలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం తిరుపతి కావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు తక్షణమే ‘జీరో ఎఫ్‌ఐఆర్’ (Zero FIR) నమోదు చేసి కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన తిరుపతి పోలీసులు నిందితుడు రామ్మూర్తిపై బిఎన్ఎస్ (BNS), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

విచారణలో రామ్మూర్తి భార్య, డిప్యూటీ తహసిల్దార్ అయిన మానస సైతం ఈ కేసు నుంచి తన భర్తను తప్పించేందుకు, బాలికను భయపెట్టేందుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరినీ పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు.

ఈ భయంకర ఘటన నేపథ్యంలో లక్ష్మీపురంలో పోలీసులు తల్లిదండ్రులకు, పిల్లలకు పలు కీలక సూచనలు చేశారు. మైనర్ పిల్లలపై ఎలాంటి లైంగిక వేధింపులు, బెదిరింపులు జరిగినా భయపడి ఎట్టి పరిస్థితుల్లోనూ దాచవద్దని పోలీసులు కోరుతున్నారు. ఎవరైనా చాట్ యాప్స్ లేదా సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోల పేరుతో బెదిరింపులకు పాల్పడితే తక్షణమే తల్లిదండ్రులకు గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలి.

మైనర్ల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story