పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు!
Andhra Pradesh: బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్ట్ ‘పోలవరం’తో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం (జూన్ 16) సందర్శించింది.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించిన 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్ట్ ‘పోలవరం’తో పాటు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం (జూన్ 16) సందర్శించింది. 'ఏపీ దర్శన్' కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు
రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు సీహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరి ఓం పాండియా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత్ అగర్వాల్, పవన్ తేజా ఏ ఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా ఈ బృందంలో ఉన్నారు. వీరంతా పోలవరం ప్రధాన ప్రాజెక్ట్, ప్రతిపాదిత జలవిద్యుత్ కేంద్రం మరియు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాలను చుట్టుముట్టి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
టెక్నికల్ అంశాలపై ఇంజనీర్ల సమగ్ర వివరణ
ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ (SE) రెడ్డి రామచంద్ర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) బాలకృష్ణ, డిఈ శ్రీనివాస్ మరియు కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ (MEIL) ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఎ. గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) మురళి పమ్మి తదితరులు ట్రైనీ అధికారులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పన, లక్ష్యాలు, ప్రస్తుత నిర్మాణ పురోగతి, ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు, పర్యావరణ అనుమతులు , భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా లభించే సామాజిక-ఆర్థిక ప్రయోజనాలపై మ్యాప్‌లు, మోడల్స్ ద్వారా సమగ్రమైన అవగాహన కల్పించారు.
ఏపీ ఆర్థికాభివృద్ధికి పోలవరం కీలకం..
ఈ సందర్భంగా పోలవరం ద్వారా లభించే సాగునీరు, రాయలసీమ-కృష్ణా డెల్టాకు నీటి మళ్లింపు, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి , వరద నియంత్రణ వంటి బహుళ ప్రయోజనాల గురించి సీనియర్ అధికారులు వివరించారు. ప్రాజెక్టు విస్తృతి, నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతను చూసి ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర సామాజిక-ఆర్థిక ప్రగతికి, రైతాంగ సంక్షేమానికి ఈ ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ లాంటిదని వారు కొనియాడారు. సాంకేతిక, పరిపాలనా అంశాలపై అక్కడి ఇంజనీర్లతో చర్చించి పలు విషయాలను తెలుసుకున్నారు.




