Tirumala : తిరుమలలో ఏఐ విప్లవం.. శ్రీవారి సేవలో అత్యాధునిక టెక్నాలజీ.. భక్తులకు ఇక ఈజీ దర్శనం

Tirumala : తిరుమలలో ఏఐ టెక్నాలజీతో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్, కల్తీని పసిగట్టే అత్యాధునిక ల్యాబ్, అలిపిరి మార్గంలో ఏఐ నిఘాపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది.

CR Reddy
Published on: 22 April 2026 7:35 AM IST
Tirumala
X

Tirumala 

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ఇప్పుడు టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం నుంచి ప్రసాదాల స్వచ్ఛతను కాపాడటం వరకు ప్రతి విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అత్యాధునిక డిజిటల్ విధానాలను అమలు చేస్తోంది. ఆధ్యాత్మికతకు ఆధునికత తోడవడంతో శ్రీవారి సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా మారుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న ఈ విప్లవాత్మక మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

కమాండ్ కంట్రోల్ సెంటర్ - ఏఐ పర్యవేక్షణ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టీటీడీ చరిత్రలో ఒక మైలురాయి. ఎన్నారైల సహకారంతో సుమారు రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తుల సంఖ్యను లెక్కించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం వంటి పనులను ఏఐ ఇట్టే చేసేస్తుంది. 3డీ మ్యాప్‌ల ద్వారా క్యూలైన్లలో భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను విశ్లేషించి, వెంటనే పరిష్కార మార్గాలు చూపుతుంది.

కల్తీ నెయ్యికి చెక్ - అత్యాధునిక ల్యాబ్

శ్రీవారి లడ్డూ అంటే ప్రపంచ ప్రసిద్ధి. ఆ రుచిని, నాణ్యతను కాపాడటానికి టీటీడీ రూ.20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెయ్యి స్వచ్ఛతను పరీక్షించడానికి ఫ్రాన్స్ టెక్నాలజీతో కూడిన ఈ-నోస్ (రుచి చూసే ముక్కు), ఈ-టంగ్ (రుచి చూసే నాలుక) వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఇవి పార్ట్స్ ఫర్ ట్రిలియన్ స్థాయిలో ఉన్న అత్యంత సూక్ష్మమైన కల్తీని కూడా పట్టేస్తాయి. సుమారు 200 రకాల అవశేషాలను గుర్తించగల సామర్థ్యం ఈ ల్యాబ్ సొంతం. కేవలం నెయ్యి మాత్రమే కాదు, పాలు, నూనె, నీటి నాణ్యతను కూడా ఇక్కడ నిరంతరం తనిఖీ చేస్తారు.

పారదర్శకమైన కొనుగోళ్లు

టీటీడీ ఏటా సుమారు రూ.700 కోట్ల విలువైన ముడి సరుకులను కొనుగోలు చేస్తుంది. గతంలో కొనుగోళ్లలో ఉన్న గుత్తాధిపత్యానికి, లొసుగులకు చెక్ పెట్టేందుకు సంపూర్ణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చారు. టెండర్ల ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగడం వల్ల పారదర్శకత పెరిగింది. ఎవరూ జోక్యం చేసుకోకుండా, నిబంధనల ప్రకారం నాణ్యమైన సరుకులే కొండపైకి వచ్చేలా డిజిటల్ నిఘా ఏర్పాటు చేశారు. ఇది టీటీడీ ఖజానాకు ఆదా చేయడమే కాకుండా, భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించడంలో తోడ్పడుతోంది.

స్మార్ట్ షూ కీపింగ్ సిస్టమ్

తిరుమలకు వచ్చే భక్తులకు పాదరక్షల భద్రత ఒక పెద్ద సమస్యగా ఉండేది. దీన్ని పరిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ షూ కీపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు తమ చెప్పులను కౌంటర్లలో ఇచ్చి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. దర్శనం ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు చాలా వేగంగా తమ పాదరక్షలను తిరిగి పొందే వెసులుబాటు ఉంది. కోరమండల్ ఇంటర్నేషనల్ సహకారంతో నడుస్తున్న ఈ వ్యవస్థ వల్ల భక్తులకు క్యూలైన్ల వద్ద గందరగోళం తప్పింది.

అలిపిరి మార్గంలో ఏఐ నిఘా

నడక దారిలో వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ ఏఐ పహారాను రంగంలోకి దించింది. అలిపిరి మార్గంలో ఏఐ సోలార్ కెమెరాలు, 360 డిగ్రీల కోణంలో పనిచేసే కెమెరాలను అమర్చారు. ఇవి 400 మీటర్ల దూరంలో ఉన్న వన్యప్రాణుల కదలికలను కూడా ఇట్టే గుర్తించేస్తాయి. అలాగే, అత్యాధునిక డ్రోన్లను కూడా నిఘా కోసం వాడుతున్నారు. ఒకవేళ చిరుతపులి లేదా ఎలుగుబంటి వంటి వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే అలారం సిస్టమ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది. దీనివల్ల అటవీ ప్రాంతంలో ప్రయాణించే భక్తులకు భద్రతపై భరోసా లభిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story