TTD Arjitha Seva Tickets : తిరుమలలో గదులు కావాలా? టికెట్లు కావాలా? అయితే మే 18 మిస్ అవ్వకండి

TTD Arjitha Seva Tickets : ఆగస్టు నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను మే 18 నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

CR Reddy
Published on: 17 May 2026 9:30 AM IST
Tirumala
X

 Tirumala

TTD Arjitha Seva Tickets : శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రేపటి (మే 18) నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. భక్తులు తమ ప్రయాణ ప్రణాళికను బట్టి ఏ రోజు ఏ టికెట్లు విడుదలవుతాయో ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

మే 18న లక్కీ డిప్ సేవలు.. ఎలా నమోదు చేసుకోవాలి?

రేపు (సోమవారం) ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి కీలకమైన ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఇవి ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) పద్ధతిలో కేటాయిస్తారు. భక్తులు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

మే 21న కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం టికెట్లు

మే 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి టికెట్లను టీటీడీ విడుదల చేస్తుంది. అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు జరిగే వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను భక్తులు బుక్ చేసుకోవచ్చు.

అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల అప్‌డేట్

మే 23వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మరిన్ని కోటాలు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఇక శారీరక ఇబ్బందులు ఉన్నవారు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కేటాయించే ఉచిత దర్శన టోకెన్ల కోటాను మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు.

మే 25న రూ.300 టికెట్లు, గదుల కోటా

సామాన్య భక్తులు ఎక్కువగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన (SSD) టికెట్లను మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు తిరుమల మరియు తిరుపతిలో బస చేసేందుకు భక్తుల వసతి గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

భక్తులకు టీటీడీ కీలక విన్నపం

టికెట్ల బుకింగ్ విషయంలో భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని టీటీడీ అధికారులు సూచించారు. కేవలం అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని కోరారు. ఇంటర్నెట్‌లో కనిపించే నకిలీ వెబ్‌సైట్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని, టీటీడీకి సంబంధించిన మొబైల్ యాప్‌ను కూడా వాడుకోవచ్చని సూచించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story