Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. రెండు ఆవులను ఢీకొట్టిన రైలు!

Vande Bharat Express: ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ వద్ద కాచిగూడ - బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 4:37 PM IST
Vande Bharat Express
X

Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. రెండు ఆవులను ఢీకొట్టిన రైలు!

Vande Bharat Express: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express) రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని హిందూపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో పట్టాలపైకి వచ్చిన రెండు ఆవులను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొంది. తెలంగాణలోని కాచిగూడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్తుండగా ఈ అనుకోని ఘటన చోటుచేసుకుంది.

రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఆవులను ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. అప్రమత్తమైన లోకోపైలట్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. అప్పటివరకు వేగంగా వెళ్తున్న రైలు పెద్ద శబ్దంతో హఠాత్తుగా ఆగడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కాసేపు అయోమయ వాతావరణం నెలకొంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ముందు భాగం (నోస్ కోన్) దెబ్బతిన్నదా లేదా అనే కోణంలో రైలును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైల్వే సిబ్బంది పట్టాలపై పడి ఉన్న ఆవుల కళేబరాలను పక్కకు తొలగించారు.

రైలు ఇంజిన్ సహా అన్ని కోచ్‌లు సురక్షితంగా ఉన్నాయని, ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని సాంకేతిక విభాగం నిర్ధారించింది. దీంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రైలు ఆగిన సమయం నుంచి దాదాపు అరగంట పాటు తనిఖీలు నిర్వహించిన అనంతరం వందేభారత్ తిరిగి బెంగళూరుకు తన ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించింది. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, రైల్వే సిబ్బందికి గానీ ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story