Earthquake : విశాఖలో అలజడి..గాఢ నిద్రలో ఉన్న జనం ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు

Earthquake : సాగర తీరం విశాఖపట్నంలో ఈ తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. బంగాళాఖాతంలో కేంద్రకృతమైన ఈ భూకంపం వల్ల జనం రోడ్లపైకి పరుగులు తీశారు.

CR Reddy
Published on: 12 July 2026 8:48 AM IST
Visakhapatnam Earthquake
X

Visakhapatnam Earthquake

Earthquake : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తీరప్రాంత నగరం విశాఖపట్నంలో ఈ తెల్లవారుజామున ఊహించని అలజడి రేగింది. ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సరిగ్గా 5 గంటల 5 నిమిషాల 46 సెకన్ల సమయంలో ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఇళ్లలో అప్పుడప్పుడే నిద్ర లేస్తున్న వారు, పడకలపై గాఢ నిద్రలో ఉన్నవారు మంచాలు, ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో షాక్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి, ఓపెన్ గ్రౌండ్లలోకి పరుగులు తీశారు. అలాగే మార్నింగ్ వాకింగ్ కోసం అప్పటికే రోడ్లపైకి వచ్చిన వారు కూడా ఈ కుదుపులను గమనించి కంగారుపడ్డారు.

భూప్రకంపనల ప్రభావం ఏయే ప్రాంతాల్లో ఉందంటే?

విశాఖ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈ భూప్రకంపనల ప్రభావం కొన్ని సెకన్ల పాటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా తీర ప్రాంతానికి దగ్గరగా ఉండే సాగర్ నగర్, అప్పుఘర్, ఈస్ట్ పాయింట్ కాలనీలతో పాటు తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెద వాల్తేరు, ఎంవీపీ కాలనీ, హెచ్‌బీ కాలనీ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న వసతి ప్రాంతాలలో నివాసితులు ఈ ప్రకంపనల తీవ్రతను ఎక్కువగా అనుభవించారు. బహుళ అంతస్తుల భవనాలలో ఉన్నవారు మరింత ఆందోళనకు లోనయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఈ కుదుపుల వల్ల నగరంలో ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. భవనాలు దెబ్బతినకపోవడంతో కొద్దిసేపటి తర్వాత నగర ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బంగాళాఖాతంలో భూకంప కేంద్రం

నగరంలో సంభవించిన ఈ భూప్రకంపనలను కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) ధ్రువీకరించింది. శాటిలైట్, సిస్మిక్ డేటా ఆధారంగా రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ భూకంపానికి గల కేంద్రం విశాఖ నగరంలో కాకుండా, బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నగరానికి తూర్పు దిశగా సుమారు 227 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని, సముద్ర మట్టానికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయని సిస్మోలజీ విభాగం స్పష్టం చేసింది.

బంగాళాఖాతంలో ఫాల్ట్ జోన్స్ రియాక్షన్

సముద్రంలో సంభవించిన ఈ భూకంపంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) జియాలజీ విభాగానికి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ యుగంధర్ రావు స్పందించారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల పరిసరాల్లో వచ్చిన భూప్రకంపనల తీవ్రతతో పోలిస్తే, ఈరోజు విశాఖలో కనిపించిన ఇంపాక్ట్ కాస్త ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. "సముద్రంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే 4.5 తీవ్రతతో భూకంపం రావడం వల్ల దీన్ని షాలో ఎర్త్‌క్వేక్ గా పరిగణిస్తాము. సాధారణంగా భూమి లోపల ఉండే ప్లేట్ల కదలికల వల్ల ఇలా జరుగుతుంది. బంగాళాఖాతంలో కూడా కొన్ని అంతర్గత ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి. వాటిలో జరిగిన కొన్ని రసాయన, భౌతిక మార్పుల రియాక్షన్ వల్లే ఈ భూప్రకంపనలు వచ్చి ఉండవచ్చు" అని ప్రొఫెసర్ యుగంధర్ రావు శాస్త్రీయంగా వివరించారు. తీరప్రాంతం కావడంతో వైజాగ్ వాసులకు ఈ ప్రకంపనలు చాలా వేగంగా చేరుకున్నాయని తెలిపారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story