Steel Plant Blast: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెను ప్రమాదం.. 8 మంది కార్మికులు దుర్మరణం..
Steel Plant Blast: విశాఖ ఉక్కు కర్మాగారంలో (SMS-2) ఘోర ప్రమాదం. స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ పేలి ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి.
Steel Plant Blast: విశాఖ ఉక్కు కర్మాగారంలో పెను ప్రమాదం.. 8 మంది కార్మికులు దుర్మరణం..
Steel Plant Blast: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం అత్యంత ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 (SMS-2), ఎస్‌టీసీ-3 (STC-3) హీట్ ఎఫ్‌జీ విభాగంలో స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున ఉక్కుద్రవం లీకై కార్మాపింగ్ ఉన్న ప్రాంతమంతా మంటలు చెలరేగాయి. ఈ భీకర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సుమారు 1,500 డిగ్రీల తీవ్రమైన వేడితో ఉన్న స్టీల్ మెటల్ లిక్విడ్ ల్యాడిల్ ద్వారా ఉక్కుద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తుండగా సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం సంభవించిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు రావడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.
మరణించిన వారిలో ఏడుగురిని అప్పారావు, ప్రభాకర్‌రావు, కృష్ణ, రమణ, త్రినాథ్, అప్పలరాజు, కుమార్‌గా గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులలో ఐదుగురు విశాఖ స్టీల్‌ప్లాంట్ శాశ్వత ఉద్యోగులు కాగా.. ముగ్గురు ఒప్పంద (కాంట్రాక్ట్) కార్మికులని అధికారులు ధృవీకరించారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో అత్యవసరంగా మాట్లాడి వివరాలు సేకరించారు. విధుల్లో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం, క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు.
విశాఖకు బయలుదేరిన హోంమంత్రి అనిత
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించారు. విజయనగరం పర్యటనలో ఉన్న మంత్రి, ప్రమాద వార్త తెలిసిన వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన విశాఖకు బయలుదేరారు. మార్గమధ్యంలోనే విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
"ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలి. బాధితులకు కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది" అని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు.
మరోవైపు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లు కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




