Vizag Steel Plant Blast: విశాఖ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరా.. బాధితుల కు అండగా ఉంటామని భరోసా
Vizag Steel Plant Blast: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆవేదన. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సపై జిల్లా అధికారులతో అత్యవసర ఫోన్ సమీక్ష.
Vizag Steel Plant Blast: విశాఖ ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరా.. బాధితుల కు అండగా ఉంటామని భరోసా
Vizag Steel Plant Blast: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం చోటుచేసుకున్న విషాదకర ప్రమాద ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే జిల్లా అధికారులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి, ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అధికారులు మంత్రికి అందించిన సమాచారం ప్రకారం, ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురిని మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. మిగిలిన బాధితులకు కూడా అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వైద్య సేవల్లో ఎలాంటి లోపం తలెత్తకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు వైద్య సిబ్బంది, అత్యవసర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, బాధితుల ప్రాణ రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.




