Markapuram: కేజీబీవీలో నీటి తిప్పలు.. బకెట్ నీళ్ల కోసం విద్యార్థినుల సుదీర్ఘ క్యూ!
Markapuram: మార్కాపురం జిల్లా పుల్లలచెరువు కేజీబీవీలో తీవ్ర నీటి కొరత నెలకొంది. బకెట్ నీళ్ల కోసం 300 మంది విద్యార్థినులు అరకిలోమీటర్ దూరం క్యూ కట్టిన ఘటన వైరల్ అవుతోంది.
Markapuram: కేజీబీవీలో నీటి తిప్పలు.. బకెట్ నీళ్ల కోసం విద్యార్థినుల సుదీర్ఘ క్యూ!
Markapuram: పుస్తకాలు పట్టుకుని తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థినులు.. ఒక బకెట్ నీటి కోసం అరకిలోమీటర్ దూరం క్యూ కట్టాల్సిన దారుణ పరిస్థితి ఎదురైంది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (KGBV) ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడటంతో దాదాపు 300 మంది విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఉదయం వేళ కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి, స్నానాలకు కూడా హాస్టల్‌లో నీళ్లు లేకపోవడంతో విద్యార్థినులు ఖాళీ బకెట్లు పట్టుకుని రోడ్డెక్కారు. పాఠశాలకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉన్న నీటి ట్యాంకర్ నుంచే నీళ్లు తెచ్చుకోవడానికి 300 మంది బాలికలు క్యూ కట్టారు. పాఠశాలలోని రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గత నాలుగు రోజులుగా అసలు నీళ్లు రావడం లేదని కేజీబీవీ ప్రిన్సిపల్ లిల్లీ వెల్లడించారు. నీటి సమస్య తీవ్రతపై ఉన్నతాధికారులకు ముందే సమాచారం అందించినప్పటికీ ఎలాంటి స్పందనా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినులు బకెట్లతో రోడ్డుపై నీటి కోసం నడుచుకుంటూ వెళ్లి క్యూ కట్టిన దృశ్యాలను 'ఆర్మీ బుజ్జీ' అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, కేజీబీవీ విద్యార్థినులకు నిరంతర నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.




