Weather Update : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వచ్చే 4 రోజులు వానలే వానలు

Weather Update : ఏపీ, తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, ఈదురు గాలులతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

CR Reddy
Published on: 8 May 2026 6:55 AM IST
Weather Update
X

Weather Update 

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా వర్షాలు పలకరించబోతున్నాయి. అయితే ఈ వర్షాలతో పాటు ఈదురు గాలుల ముప్పు కూడా పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణ భారత్‌లో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కేరళ, తమిళనాడులో ఇప్పటికే వర్షాలు జోరందుకున్నాయి. మే 10, 11 తేదీలలో కర్ణాటక తీరప్రాంతంలో కూడా మెరుపులతో కూడిన వానలు పడవచ్చు.

తెలంగాణకు గాలి వాన ముప్పు

మే 8 శుక్రవారం నాడు తెలంగాణలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత కూడా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉండవచ్చు. అయితే, దక్షిణ తెలంగాణ ప్రజలు మాత్రం ఈదురు గాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గంటకు 20 నుంచి 31 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో తేమ సుమారు 35 శాతంగా నమోదవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సడెన్ వర్షాలు - రాయలసీమకు హై అలర్ట్!

ఏపీలో రోజంతా ఎండ ఉన్నా, సాయంత్రం సమయాల్లో అకస్మాత్తుగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. సాధారణంగా కురిసే జల్లుల కంటే ఇవి చాలా తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు ఉండవచ్చు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గాలుల వేగం గంటకు 42 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అల్పపీడనం, తుపాను ప్రభావం

ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఇన్వెస్ట్ 93S అనే కోడ్ నేమ్‌తో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది మే 9 నుంచి తెలుగు రాష్ట్రాల వైపు భారీ మేఘాలను నెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో హాగుపిట్ అనే తుపాను తీవ్రంగా తిరుగుతోంది. దీని ప్రభావం నేరుగా భారత్‌పై లేకపోయినా, వర్షాకాలం (నైరుతీ రుతుపవనాలు) త్వరగా వచ్చేందుకు ఇది దోహదపడుతోంది. భూమధ్య రేఖ వద్ద ఉన్న భారీ మేఘాలు మే 9 నుంచి దక్షిణ భారత్ పైకి కదిలి రానున్నాయి.

రైతులకు ముఖ్య గమనిక - జాగ్రత్తలు తప్పనిసరి

శుక్రవారం నుంచి సోమవారం వరకు రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పంట దిగుబడిని పొలాల్లో ఆరబోయడం లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం ప్రమాదకరం. అప్పటివరకు ఎండ ఉండి, కేవలం 15 నిమిషాల్లోనే వాతావరణం మారిపోయి భారీ వర్షం పడవచ్చు. ఈ మేఘాలు క్యుములోనింబస్ రకానికి చెందినవి కావడంతో వీటిలో పిడుగులు పడే అవకాశం కూడా ఎక్కువ. కాబట్టి ఉరుములు వచ్చేటప్పుడు చెట్ల కింద లేదా కరెంటు స్తంభాల దగ్గర ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story