Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఏయే జిల్లాల్లో పడనున్నాయో తెలుసా?
Weather Update: నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఉపరితల ఆవర్తనాల కదలికల కారణంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి.
Weather Update
Weather Update: నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఉపరితల ఆవర్తనాల కదలికల కారణంగా వాతావరణంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనడంతో పాటు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు
తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగతా జిల్లాల్లో ఉదయం పూట ఎండ తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత చల్లని ఈదురుగాలులు వీచే అవకాశముంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి.
హైదరాబాద్ నగరంలో మేఘావృతమైన ఆకాశం
రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘాలతో కప్పబడి ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో నగరవాసులు ఇబ్బందిపడే అవకాశం ఉంది. అయితే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే వీలుందని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ వాతావరణంలో వైవిధ్యం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే వీలుంది. తీర ప్రాంతాల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది.
ప్రజలు, రైతులకు అధికారుల హెచ్చరికలు
తీర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచించారు. కోత దశకు వచ్చిన పంటలను రైతులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.




