Amlapuram: పెరగనున్న ఎండలు.. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు వద్దు

Amlapuram: కోనసీమ జిల్లాలో మే 20 నుండి 26 వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

PRABHU, RAZOLE
Published on: 19 May 2026 11:13 AM IST
Amlapuram
X

Amlapuram: పెరగనున్న ఎండలు.. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు వద్దు

అమలాపురం: తీర ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తీవ్ర ఎండలు, ఉక్కపోత వాతావరణం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.ఆర్.మహేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి అనిపించే పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.

ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఎండలో పనిచేసే కూలీలు, రైతులు, కార్మికులు, డెలివరీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది వంటి వారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం ప్రజలు తరచూ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని తెలిపారు.

బయటకు వెళ్లే సమయంలో టోపీ, గొడుగు, తల కప్పుకునే వస్త్రాలు ఉపయోగించాలని సూచించారు. పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలేయకూడదని, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. తలనొప్పి, అధిక దాహం, అలసట, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ప్రజలకు తక్షణ వైద్య సహాయం అందేలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి సరఫరా, వైద్య సేవలు, గ్రామాలు మరియు పట్టణాల్లో నీడ ఏర్పాట్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story