Weather Update : తెలుగు రాష్ట్రాల పై భానుడి ప్రతాపం.. అడుగు బయటపెడితే మాడిపోవడమే!
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్టంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజులు వడగాల్పులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Weather Update
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రస్తుతం ఎండలు, తీవ్రమైన వడగాడ్పులతో నిప్పుల కొలిమిలా మారాయి. ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఊరటనిచ్చేలా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం అప్‌డేట్ ఇచ్చింది.
ఏపీలో రికార్డ్ బ్రేక్ ఎండలు..
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ పరిధిలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. బుధవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డ్ సృష్టించింది. 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువ వేడి నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఉదయం 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యం
ఎండ తీవ్రతకు వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు ఠారెత్తిస్తుండటంతో పగటి ప్రయాణాలను జనాలు రద్దు చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన రోడ్లు, మార్కెట్లు ఉదయం 10 గంటలకే జనం లేక వెలవెలబోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎండ దెబ్బకు భయపడి వ్యాపారులు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ దుకాణాలను మూసివేస్తున్నారు.
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో కూడా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా వీచే ఛాన్స్ ఉంది. అయితే, తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండటం వల్ల అక్కడక్కడా ఉపశమనం లభించనుంది. రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి మాత్రం పొడి వాతావరణం ఏర్పడనుంది.
నైరుతి రుతుపవనాల రాక
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక మంచి వార్త చెప్పింది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్ష్మీద్వీప్ ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతంతో పాటు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాల్లోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అనుకున్న సమయానికి విస్తరిస్తే జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి వర్షాలు ప్రవేశించే అవకాశం ఉంది.




