West Godavari: వంద శాతం ఈ-కేవైసీ లక్ష్యం.. అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం!
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కలెక్టర్ కీలక సమీక్ష. స్వామిత్వ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు ఈ-కేవైసీ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు.
West Godavari: వంద శాతం ఈ-కేవైసీ లక్ష్యం.. అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం: జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల సర్వేయర్లతో స్వామిత్వ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే (UFS), ఈ-కేవైసీ అంశాలపై మండలాల వారీగా ప్రగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా పూర్తి చేయాల్సిన స్వామిత్వ సర్వే పనులను తక్షణమే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రేపటి నుండి సర్వే ప్రగతిపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహిస్తానని, మండల అభివృద్ధి అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనులు చేపట్టాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలాలకు కేటాయించిన సర్వేయర్లు రేపు ఉదయం 8 గంటలకు సంబంధిత ఎంపీడీవోల వద్ద హాజరై పనులను ప్రారంభించాలని తెలిపారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అదేవిధంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మరియు ఈ-కేవైసీ ప్రగతిపై కూడా సమీక్షించి, నూరు శాతం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నరసాపురం ఆర్డీవో దాసిరాజు, జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారి వై. దోసి రెడ్డి, జిల్లాలోని తహసిల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.




