YS Jagan: బ్యాలెట్ బాక్సుల వ్యవహారంపై జగన్ ప్రశ్నలు.. ఎమ్మెల్సీ అరెస్టుపై తీవ్ర అభ్యంతరం
YS Jagan: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందంటూ చంద్రబాబుపై 'ఎక్స్' వేదికగా విమర్శలు.
YS Jagan: బ్యాలెట్ బాక్సుల వ్యవహారంపై జగన్ ప్రశ్నలు.. ఎమ్మెల్సీ అరెస్టుపై తీవ్ర అభ్యంతరం
YS Jagan: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలను నిలదీస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, నిరంకుశంగా నిర్బంధించడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా అప్రజాస్వామిక పాలన సాగుతోందని, ఇది అత్యంత హేయమైన చర్య అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
పరిషత్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నుంచి నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సులను దారి మళ్లించి, మధ్యలోనే నల్లపాడు వద్ద ఎందుకు దించారంటూ వైఎస్ జగన్ నిలదీశారు. అధికారులు, కూటమి నాయకులు కలిసి చేసిన ఈ రకమైన అక్రమాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. బ్యాలెట్ బాక్సులను మార్చే ప్రయత్నం చేస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రశ్నించిన తమ వారిపైనే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా చట్టసభలో ఉన్న ఒక ఎమ్మెల్సీపై డెకాయిటీ, దొంగతనం వంటి తప్పుడు కేసులు నమోదు చేయడం కంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదని మండిపడ్డారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం నుంచి బ్యాలెట్ బాక్సులను తరలించే వరకు ప్రతీ నిమిషం రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని విచక్షణారహితంగా ఖూనీ చేస్తూ, తప్పులను ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. అధికార బలం, పోలీసుల భయంతో మీ అక్రమాలను ఎప్పటికీ దాచిపెట్టలేరని, ఏపీలో జరుగుతున్న ఈ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా గమనిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని జగన్ తన ట్వీట్లో హెచ్చరించారు.




