YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి.. చంద్రబాబు, లోకేష్‌లపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజం

YS Jagan: డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, లీకేజీలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదని..

Arun Chilukuri
Published on: 20 Aug 2026 1:14 PM IST
YS Jagan
X

YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి.. చంద్రబాబు, లోకేష్‌లపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజం

డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలు, లీకేజీలపై ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరగాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన డీఎస్సీ మరియు గత ప్రభుత్వంలో జరిగిన ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్-1 నియామకాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.

డీఎస్సీలో భారీ స్కాం: లోకేష్ రాజీనామా చేయాలి

డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై తాము లేవనెత్తుతున్న అంశాలు వాస్తవమని, అందుకే ప్రభుత్వం దర్యాప్తునకు ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు. ప్రశ్నపత్రాల తయారీ బాధ్యతను, పరీక్ష నిర్వహణ బాధ్యతను ఒకే అధికారికి అప్పగించడం ద్వారా పారదర్శకతను దెబ్బతీశారని, ఇది లీకేజీకి దారితీసిందని విమర్శించారు. దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ‘నవీన్’కు ఫస్ట్ ర్యాంకు వచ్చినా, ఉద్యోగం ఇవ్వకుండా మెరిట్ లిస్టు మార్చేశారని, ఇదంతా లీకేజీని దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నమని ఆరోపించారు. అభ్యర్థి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదని ప్రభుత్వం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని, ఐడీ బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు అభ్యర్థి ఎలా వస్తారని ప్రశ్నించారు.

స్పోర్ట్స్ కోటా పేరిట ఉద్యోగాల విక్రయం

స్పోర్ట్స్ కోటాలో 372 ఉద్యోగాలను భర్తీ చేయడంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎస్సీలో అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చిన వారికి, పీవీ సింధు వంటి క్రీడాకారులకు పోలిక తీసుకురావడం చంద్రబాబు, లోకేష్‌ల అజ్ఞానానికి నిదర్శనమని జగన్ విమర్శించారు.

గతంలో డీఎస్సీ పరీక్ష పాసైన వారికే స్పోర్ట్స్ కోటా వర్తించేదని, కానీ ఈసారి పరీక్ష కూడా రాయకుండానే, తమ అనుకూల అసోసియేషన్ల ద్వారా అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నా, నిందితులను కాపాడేందుకు ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు లేకుండా చేశారని మండిపడ్డారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1పై జగన్ వివరణ

తనను, తన ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు గ్రూప్-1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగన్ కొట్టిపారేశారు. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిందని, ఇందులో ఎటువంటి పేపర్ లీకేజీలు లేవని స్పష్టం చేశారు.

కోవిడ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో, డిజిటల్ ఎవాల్యుయేషన్ గురించి కమిషన్ నిర్ణయం తీసుకుంటే, హైకోర్టు అభ్యంతరాల మేరకు దాన్ని పక్కనపెట్టి, మాన్యువల్ ఎవాల్యుయేషన్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు.

ఇలా ఎంపికైన 163 మంది అభ్యర్థులు నాలుగేళ్లుగా విధుల్లో ఉన్నారని, ఇప్పుడు వారి జీవితాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరగా, నీట్ (NEET) లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే, ఏపీలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ ఎందుకు రాజీనామా చేయరని జగన్ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా, తామే అన్నీ చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నారని తండ్రీకొడుకులపై విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story