YS Jagan: వైసీపీ నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు? ధైర్యముంటే పోటీకి రండి: వైఎస్ జగన్ సవాల్!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. నామినేషన్ల అడ్డంకులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై తాడేపల్లిలో మాట్లాడారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2026 12:46 PM IST
YS Jagan
X

YS Jagan: వైసీపీ నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు? ధైర్యముంటే పోటీకి రండి: వైఎస్ జగన్ సవాల్!

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక పోరులో గెలిచేందుకు కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, పేపర్లు చింపివేయడం వంటి కుట్రలకు తెరలేపారని జగన్ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ఎస్‌ఈసీ, గవర్నర్‌తో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించామని గుర్తుచేశారు. "వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి మొట్టికాయలు వేసింది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, పోలీసు బందోబస్తుతో పాటు సీసీటీవీ రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను వాయిదా వేయాలని స్పష్టం చేసింది" అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు అంత స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ చంద్రబాబు వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చేతిలో తోలుబొమ్మలుగా మారిన డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలలో ఎలాంటి మార్పు రాలేదని, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. "నిజంగా ప్రజలకు మంచి చేశామనే నమ్మకం, ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉంటే వైఎస్సార్‌సీపీ నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారు? భయం లేకపోతే పోటీకి సిద్ధపడాలి" అని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ ఏకమై ఇటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.