విజయసాయి రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక రాజకీయ చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి రాజకీయంగా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి రాజకీయంగా దూరమైన ఇద్దరు ముఖ్య నేతల భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఇటీవల వైసీపీని వీడిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. బుధవారం జరిగిన ఈ భేటీ పైకి కుటుంబ వేడుక ఆహ్వానమే అయినప్పటికీ, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.
తన కుమార్తె అంజలి వివాహ ఆహ్వాన పత్రికను విజయసాయి రెడ్డికి స్వయంగా అందజేసిన వైఎస్ షర్మిల, కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కాసేపు స్నేహపూర్వక వాతావరణంలో సంభాషణ సాగింది. అయితే, విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డి వైఖరిపై, పార్టీ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, అసలైన రెడ్డి సామాజికవర్గానికి సరైన ప్రాధాన్యత దక్కలేదని ఆరోపిస్తూ త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరోవైపు షర్మిల కూడా మొదటి నుంచీ జగన్ విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో జగన్‌పై అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒకేచోట కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు తావిచ్చింది. కాగా, షర్మిల రాకపై విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆత్మీయ పోస్ట్ చేశారు. డాక్టర్ వైఎస్సార్ గారి మనుమరాలు, షర్మిలమ్మ కుమార్తె అయిన చిరంజీవి అంజలి వివాహ పత్రికను ఇచ్చి, కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా షర్మిలమ్మ తనను ఆహ్వానించారని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.




