Perni Nani: ఆర్టీసీని అమ్మేసేందుకు చంద్రబాబు కుట్ర.. ఉచిత బస్సు పథకంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Perni Nani: కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Perni Nani: ఆర్టీసీని అమ్మేసేందుకు చంద్రబాబు కుట్ర.. ఉచిత బస్సు పథకంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాలిసీలపై సంచలన విమర్శలు చేశారు.
గడిచిన రెండు సంవత్సరాల కూటమి కాలంలో ప్రభుత్వం ఏకంగా 3.50 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని పేర్ని నాని దుయ్యబట్టారు. "రాష్ట్రంలో కేవలం అప్పులే కాదు.. దేశంలోనే నేరాలు, నిరుద్యోగ రేటులో కూడా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. రాష్ట్ర సంపద అంతా ప్రజలకు చేరకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లోకే వెళ్తోంది" అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, వేలాది మంది ఉద్యోగులకు ప్రభుత్వ భద్రత కల్పించామని పేర్ని నాని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా ఆర్టీసీని అమ్మేయడానికి చూస్తోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నందుకే సంస్థ నష్టపోతోందనే నెపాన్ని వారిపై నెట్టి, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ 'పీఎం ఈ-బస్ సేవ' కింద ఆర్టీసీలోని 10 వేల బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామనడం సరైన నిర్ణయం కాదని, ఇది సంస్థను నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగమేనని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉండవని పేర్ని నాని విమర్శించారు. గతంలో 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గనుక ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, చంద్రబాబు ఆ కాలంలోనే ఆర్టీసీని పూర్తిగా అమ్మేసి ఉండేవారంటూ నాటి రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను వైఎస్సార్‌సీపీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.




