Avinash Reddy: జీవోలు, అనుమతులు జగన్‌వి.. క్రెడిట్ చంద్రబాబుదా?: ఎంపీ అవినాశ్ రెడ్డి ఫైర్!
Avinash Reddy: కడప స్టీల్ ఫ్యాక్టరీ మరియు అమరావతి రాజధానిపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పాత ప్రాజెక్టులపై ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని మండిపడ్డారు.
Avinash Reddy: జీవోలు, అనుమతులు జగన్‌వి.. క్రెడిట్ చంద్రబాబుదా?: ఎంపీ అవినాశ్ రెడ్డి ఫైర్!
Avinash Reddy: కడప స్టీల్ ఫ్యాక్టరీ మరియు అమరావతి రాజధాని వ్యవహారాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత ప్రాజెక్టులపై ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కడప స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీవోల జారీ అంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగితే.. ఇప్పుడు చంద్రబాబు ఆ క్రెడిట్ నాదే అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని అవినాశ్ రెడ్డి ఈ సందర్భంగా వరుస క్రమంలో వివరించారు:
2019: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ (JSW) సంస్థను కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఒప్పించింది.
2022: ఫ్యాక్టరీ నిర్మాణానికి అవసరమైన అధికారిక జీవోలను జారీ చేయడంతో పాటు, ఫేజ్-1 కింద 1100 ఎకరాల భూసేకరణను (Land Acquisition) విజయవంతంగా పూర్తి చేసింది.
2023 ఫిబ్రవరి: అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల క్లియరెన్సులు జగన్ ప్రభుత్వమే తెచ్చిందని, ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ అధినేత సజ్జన్ జిందాల్ స్వయంగా ప్రకటించారని అవినాశ్ గుర్తుచేశారు. తాజాగా కడప సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆ సభ స్టీల్ ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కాకుండా, కేవలం జగన్‌ను దూషించడానికే పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
ఇదే క్రమంలో అమరావతి రాజధానిపైనా అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "అమరావతి అనేది రాష్ట్ర ప్రజలందరి రాజధాని కాదు.. అది కేవలం ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారింది" అని ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తుత డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా గతంలో అంగీకరించారని ఆయన గుర్తు చేశారు.
నాటి శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన శాస్త్రీయ సూచనలను తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతి కోసం ఏకంగా రూ.2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేయాలని చూస్తున్నారన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడే ఆచరణాత్మకమైన 'మావిగన్' (MAVIGAN) నమూనాను ప్రతిపాదించారని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.




