Sajjala Ramakrishna Reddy: ఐదేళ్ల జగన్ హయాం అప్పులను.. చంద్రబాబు రెండేళ్లలోనే చేసేశారు: సజ్జల ఫైర్!

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 1 Jun 2026 4:07 PM IST
Sajjala Ramakrishna Reddy
X

Sajjala Ramakrishna Reddy: ఐదేళ్ల జగన్ హయాం అప్పులను.. చంద్రబాబు రెండేళ్లలోనే చేసేశారు: సజ్జల ఫైర్!

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వారి వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను పూర్తిగా మార్చేసుకున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన ఒక ప్రత్యేక బుక్‌లెట్‌ను సజ్జల మీడియా సమక్షంలో విడుదల చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ కార్యాచరణకు రూపకల్పన చేశారని ఆయన వెల్లడించారు.

కూటమి ప్రభుత్వ ఆర్థిక విధానాలపై సజ్జల తీవ్రంగా మండిపడ్డారు. "గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో కోవిడ్ వంటి అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి, రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. ఆ ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను.. ఈ చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే చేసేసింది. ఇంత భారీగా అప్పులు తెచ్చినప్పటికీ, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా ఇతర హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని సజ్జల ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో ప్రస్తుతం విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, విద్యా, వైద్య రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. జగన్ హయాంలో ఎంతో అద్భుతంగా సాగిన సంక్షేమ పథకాలను నిలిపివేశారని, ముఖ్యంగా డ్వాక్రా మహిళల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి మెగా డీఎస్సీ నియామకాలపై సంచలన ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, సాక్ష్యాలతో సహా విషయాలు బయటకు వచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ఆఖరికి తాడు లాగే పోటీల్లో (Tug of War) గెలిచిన వారికి కూడా టీచర్ పోస్టులు ఇచ్చేశారని, అర్హులైన మెరిట్ అభ్యర్థులను పక్కనబెట్టి తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అన్నీ సాధించామని అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు రేపు జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, చర్చలు జరపనున్నట్లు సజ్జల ప్రకటించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడిన ఆయన.. ప్రస్తుతం ఏపీ పడిపోయిన పరిస్థితి నుంచి మళ్లీ గాడిలో పడాలంటే భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story