Sepetmber 2026: తుల, వృశ్చిక, ధనస్సుః ఈ రాశులవారికి కలిసివచ్చే రంగులు...అదృష్టరత్నాలు

సెప్టెంబర్ 2026లో తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి కలిసివచ్చే రంగులు, అదృష్ట రత్నాలు, గ్రహ ప్రభావాలు, ఆధ్యాత్మిక పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 3 Sept 2026 8:15 AM IST
Sepetmber 2026: తుల, వృశ్చిక, ధనస్సుః ఈ రాశులవారికి కలిసివచ్చే రంగులు...అదృష్టరత్నాలు
X

Sepetmber 2026: సెప్టెంబర్‌ 2026 నెలలో గ్రహాల కదలికలు తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి జీవితంలోని పలు అంశాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొందరికి కొత్త అవకాశాలు ఎదురైతే.. మరికొందరు కొన్ని విషయాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, మనకు అనుకూలంగా భావించే రంగులను ధరించడం, అదృష్ట రత్నాలను శాస్త్రోక్తంగా ధరించడం, ఇష్టదైవాన్ని ఆరాధించడం ద్వారా సానుకూల శక్తిని పెంచుకోవచ్చని చెబుతారు. ఈ నెలలో తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి పరిస్థితులు ఒకే విధంగా ఉండవు. ఒకరి బలం మరొకరికి సవాలుగా మారవచ్చు. అందుకే రాశికి అనుగుణంగా కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు పాటించడం మంచిదని పండితులు సూచిస్తారు.

తులారాశి

తులారాశివారికి సెప్టెంబర్‌ నెల ఆశాజనకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వృత్తి జీవితంలో మార్పులు కోరుకునేవారికి అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పైస్థాయి అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగకుండా జాగ్రత్త వహించాలి. నెల ప్రారంభంలో కొంత ఏకాంతాన్ని కోరుకునే స్వభావం కనిపించవచ్చు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినా ఎక్కువకాలం కొనసాగవు. ఆరోగ్యం విషయంలో ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. కంటి అలసట, జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందులు లేదా శారీరక నీరసం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది.

ఈ సెప్టెంబర్‌ నెలలో తులారాశివారికి తెలుపు, లేతనీలం రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశివారు వజ్రాన్ని లేదా ఓపల్‌ని వేలికి ధరించడం వలన మేలు జరుగుతుంది. మంగళవారం లేదా శనివారం హనుమాన్‌ చాలీసా పారాయణం చేయడం, ఆంజనేయస్వామిని భక్తితో పూజించడం శుభప్రదంగా భావిస్తారు.

వృశ్చికరాశి

వృశ్చిక రాశివారికి సెప్టెంబర్‌ నెల ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నా.. క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా నెల ద్వితీయార్థంలో వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతికి మార్గం సుగమమవుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపార ప్రయాణాలు కొత్త పరిచయాలకు దారితీయవచ్చు.

చట్టపరమైన వ్యవహారాలు లేదా చాలాకాలంగా కొనసాగుతున్న వివాదాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే కుటుంబ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరగా స్పందించకపోవడం మంచిది. వైవాహిక జీవితంలో కూడా మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే బడ్జెట్‌ సిద్ధం చేసుకోవడం ప్రయోజనకరం.

ఈ రాశివారికి సెప్టెంబర్‌ మాసంలో ఎరుపు, మెరూన్‌ రంగులు కలిసి వస్తాయి. ఇక వృశ్చికరాశివారు సెప్టెంబర్‌ నెలలో పగడాన్ని ధరించడం వలన గ్రహబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, కందులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

ధనుస్సురాశి

ధనుస్సు రాశివారికి సెప్టెంబర్‌ 2026లో అవకాశాలు విస్తరించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్‌, జీతం పెంపు లేదా మెరుగైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కూడా మంచి అవకాశాలు ఎదురుకావచ్చు. వ్యాపారస్తులకు విస్తరణ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూల సమయం. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం పెరగడంతో పాటు సమాజంలో గౌరవం, పరిచయాలు కూడా విస్తరించవచ్చు.

అయితే వైవాహిక జీవితంలో మాత్రం మాటతీరు విషయంలో జాగ్రత్త అవసరం. ఆవేశంగా మాట్లాడటం వల్ల చిన్న విషయం పెద్దదయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి కారణంగా శారీరక అలసట ఏర్పడవచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవాలి.

ఈ రాశివారికి సెప్టెంబర్‌ నెలలో పసుపు, బంగారు రంగు దుస్తులు కలిసి వస్తాయి. అదేవిధంగా కనకపుష్యరాగాన్ని ఈ రాశివారు ధరించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే, గురువారం దత్తాత్రేయ స్వామి లేదా రాఘవేంద్ర స్వామిని భక్తితో పూజించడం, ఆలయంలో శనగలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story