Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని ఏ రాశివారు ఎలా జరుపుకోవాలంటే

వరలక్ష్మీ వ్రతం రోజున ఏ రాశివారు ఏ రంగు పువ్వులతో అమ్మవారిని అర్చించాలో తెలుసుకుందాం. నైవేద్యం ఎలా సమర్పించాలో తెలుసుకుందాం.

Balachander
Published on: 21 Aug 2026 8:33 AM IST
Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని ఏ రాశివారు ఎలా జరుపుకోవాలంటే
X

Varalakshmi Vratam: శ్రావణమాసంలో ఆచరించే వరలక్ష్మీ వ్రతం అత్యంత పవిత్రమైనది. వరలక్ష్మీ దేవిని అందరూ ఒకే విధివిధానంతో పూజించినప్పటికీ, తమ జన్మరాశికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన నివేదనలు, పూజా క్రమాలు పాటించడం వల్ల అమ్మవారి దివ్య అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుందని జ్యోతిష్య, వాస్తు పండితులు చెబుతున్నారు. 12 రాశుల వారు వరలక్ష్మీ వ్రతం రోజున ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

ఏరాశివారు ఎలా

మేష రాశి వారు ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి. 'శ్రీ లక్ష్మీ అష్టకం' పఠిస్తూ తీపి పదార్థాలు, సీజనల్ పండ్లను నివేదనగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. అదేవిధంగా వృషభ రాశి వారు తామర పూలతో లక్ష్మీదేవిని పూజించడం శ్రేష్ఠం. 'శ్రీసూక్తం' లేదా 'లక్ష్మీ సహస్రనామాలు' పారాయణం చేస్తూ కేసరి లేదా ఖీర్ నైవేద్యంగా పెట్టాలి. ఇక మిథునరాశివారు పచ్చని రంగు పూలు లేదా పత్రాలతో అర్చన చేయాలి. నారింజ, ద్రాక్ష పండ్లను సమర్పించి, వ్రతకథను భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయాలి. ఇకపోతే, కర్కాటకరాశివారు తెల్లని పరిమళ భరిత పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించాలి. పాలు, బెల్లంతో చేసిన పరమాన్నాన్ని అమ్మవారికి నివేదించాలి.

సింహరాశివారు పసుపు లేదా బంగారు వర్ణంలో ఉండే పూలతో పూజించాలి. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తూ కుంకుమపువ్వు కలిపిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. కన్యారాశివారు రంగురంగుల నానావిధ పుష్పాలతో శ్రీసూక్త విధానంలో అర్చించాలి. పులిహోర, దద్ద్యోజనం సమర్పించడం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే తులా రాశి వారు శ్వేత వర్ణ (తెలుపు) పుష్పాలతో అమ్మవారిని ఆరాధించాలి. వ్రత కథ పఠించి, తామర గింజలు లేదా పాయసాన్ని నివేదించాలి. ఇక వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు మందార లేదా గులాబీలతో అర్చించాలి. బెల్లం పాయసం, తాజా పండ్లను సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనస్సురాశి వారు పసుపు వర్ణ పుష్పాలను ఉపయోగించి పూజించాలి. కేసరి మరియు పసుపు రంగు తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించాలి. మకరరాశివారు నీలం రంగు పుష్పాలతో 'లక్ష్మీ సహస్రనామాలు' పఠించాలి. నువ్వులతో చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. కుంభరాశివారు ఆకాశనీలం రంగు పూలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి. పంచామృతాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మీనరాశివారు పసుపు రంగు పూలతో లక్ష్మీ సహస్రనామ పూజ చేయాలి. పాయసం, ఫలాలను నివేదిస్తే కుటుంబంలో ఐశ్వర్యం వికసిస్తుంది.

పూజావిధానం

అమ్మవారి పూజ ఉదయం లేదా ప్రదోష సమయంలో జరుపుకుంటారు. సుచిగా స్నానాదులు ముగించిన తరువాత అమ్మవారిని పీఠంపై అలంకరించి ఇతోధికంగా తమ శక్తికొలది రాశులకు సంబంధించిన పువ్వులతో అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరణ అంటే ప్రీతి. అలంకరణ తరువాత వ్రతంలో చెప్పబడిన పూజా విధానాన్ని అనుసరించి పూజ చేయాలి. శక్తిమేరకు రాశులవారు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. పూజానంతరం తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడం వలన ఐదోతనం నిండుగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story