Electric Scooter: 142 కిమీ రేంజ్.. రూ.1.10 లక్షల ధర.. కార్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అంపైర్ తన క్రేజీ స్కూటర్ మ్యాగ్నస్ G మాక్స్‌ను సరికొత్త సాంకేతికతతో భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

CR Reddy
Published on: 13 Aug 2026 8:35 AM IST
Ampere Magnus G Max
X

Ampere Magnus G Max

Electric Scooter: భారత ఈవీ రౌండప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అంపైర్ సంస్థ మ్యాగ్నస్ G మాక్స్ మోడల్‌ను సరికొత్తగా రీలాంచ్ చేసింది. రూ.1,09,999ల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ రూపొందించిన కొత్త NxG.io సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపుదిద్దడం వల్ల ఏకంగా 30కి పైగా స్మార్ట్, కనెక్టెడ్ ఫీచర్లు వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. కార్లలో మాత్రమే కనిపించే క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు ఇందులో సొంతం చేసుకోవచ్చు.

ఫోన్ నుంచే కంట్రోల్.. భద్రతకు పెద్దపీట

కొత్త సాఫ్ట్‌వేర్ అనుసంధానంతో స్కూటర్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు యాప్ సపోర్ట్‌ను మెరుగుపరిచారు. విపరీతమైన పార్కింగ్ రద్దీలోనూ వాహనాన్ని సులువుగా గుర్తుపట్టేందుకు ఫైండ్ మై స్కూటర్, పింగ్ మై స్కూటర్ ఆప్షన్లు ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా రియల్ టైమ్ ఛార్జింగ్ వివరాలు, ప్రయాణించిన వేగం, జియో ఫెన్సింగ్, దొంగతనం జరిగినప్పుడు అప్రమత్తం చేసే సెక్యూరిటీ అలర్ట్ వంటివి సులువుగా తెలుసుకోవచ్చు. స్కూటర్‌లో ఏదైనా సమస్య వస్తే సర్వీస్ సెంటర్‌కు వెళ్లకముందే గుర్తించే రిమోట్ డయాగ్నోస్టిక్స్ ఫీచర్ దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ల్యాప్‌టాప్‌లా ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల తరహాలోనే ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ ఫీచర్‌ను అమర్చారు. దీనివల్ల భవిష్యత్తులో కంపెనీ విడుదల చేసే కొత్త ఫీచర్లు, సాఫ్ట్‌వేర్ మార్పులు ఏవైనా సరే నేరుగా ఇంట్లోనే ఉండి అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాహనదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే తాజా వెర్షన్‌ను ఆస్వాదించవచ్చు.

2 లక్షల కిలోమీటర్ల బ్యాటరీ లైఫ్

ఈ 2026 అంపైర్ మ్యాగ్నస్ G మాక్స్ ఈవీలో 3 kWh సామర్థ్యమున్న LFP బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐడిసి ప్రమాణాల ప్రకారం 142 కిలోమీటర్లు, సాధారణ రహదారుల్లో 100 కిలోమీటర్లకు పైగా నిరంతర ప్రయాణాన్ని అందిస్తుంది. గంటకు 65 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ స్కూటర్ 2.4 kW పీక్ పవర్, 130 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ ఏకంగా 2,00,000 కిలోమీటర్ల వరకు లైఫ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేయడం విశేషం. దీనికి తోడుగా 5 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీని సంస్థ ఆఫర్ చేస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story