Ather: చేతక్, ఐక్యూబ్‌లకు షాక్.. ఏథర్ నుంచి మార్కెట్‌ను ఊపేసే ఎలక్ట్రిక్ స్కూటర్

Ather: ప్రముఖ ఈవీ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లోకి ఆల్ న్యూ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది.

CR Reddy
Published on: 3 Sept 2026 11:17 AM IST
Ather Energy
X

Ather Energy

Ather: ప్రముఖ ఈవీ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లోకి ఆల్ న్యూ కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా విడుదల చేసింది. రూ.లక్ష ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ స్కూటర్, సెగ్మెంట్‌లోనే మునుపెన్నడూ లేని ఐదు సరికొత్త సాంకేతికతలతో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా వంటి దిగ్గజాలకు సవాల్ విసురుతోంది. ఏథర్ ఎనర్జీ ప్రత్యేకంగా రూపొందించిన ఈఎల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా కోనార్క్ స్కూటర్ రూపుదిద్దుకుంది. రాబోయే రోజుల్లో ఇదే వేదికపై మరిన్ని అధునాతన మోడళ్లను తీసుకురావడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నూతన ప్లాట్‌ఫామ్ కారణంగా వాహనం అత్యంత దృఢంగా మారడమే కాకుండా వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, బూట్ స్పేస్ వంటి కీలక అంశాల్లో ఎంతో మెరుగైన సౌకర్యం లభించింది. వినియోగదారులకు గరిష్ట స్థాయి డ్రైవింగ్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దారు.

స్మార్ట్ కీ టెక్నాలజీ, 14 ఇంచుల అల్లాయ్ వీల్స్

ఏథర్ కోనార్క్ ఎస్, జెడ్ అనే రెండు ఆకర్షణీయ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో జెడ్ వేరియంట్‌తో పాటు రెండు బటన్లు ఉన్న ప్రత్యేకమైన స్మార్ట్ కీ లభిస్తుంది. పెద్ద పార్కింగ్ ఏరియాల్లో బైక్ ఎక్కడుందో వెతకడానికి, అలాగే బూట్ స్పేస్ సులభంగా అన్‌లాక్ చేయడానికి ఈ బటన్లు ఉపయోగపడతాయి. స్కూటర్ వెనుక భాగంలో ఇచ్చిన పుష్ బటన్ ద్వారా కూడా డిక్కీని సులభంగా తెరవవచ్చు. సాధారణంగా స్కూటర్లలో 12 ఇంచుల వీల్స్ మాత్రమే ఉంటాయి, ఈ స్కూటర్ ముందరి భాగంలో ఏకంగా 14 ఇంచుల పెద్ద అల్లాయ్ వీల్ అమర్చారు. గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లపై కూడా రైడర్ ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.

ఎయిర్ వాక్ ఫీచర్, ఆన్ బోర్డ్ చార్జర్ సౌలభ్యం

ముఖ్యంగా మహిళలకు, వయోవృద్ధులకు కాళ్లతో నెట్టుకుంటూ స్కూటర్‌ను వెనక్కి లేదా ముందుకు జరపడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఈ కష్టానికి చెక్ పెడుతూ ఎయిర్ వాక్ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. కాళ్లతో నెడుతున్నప్పుడు ఈ ఫీచర్ యాక్టివేట్ అయి, ఒకే చేతితో పట్టుకున్నా వాహనం తానంతట తానే బ్యాలెన్స్ అవుతూ ముందుకు, వెనక్కు కదులుతుంది. మరోవైపు బూట్ స్పేస్‌లో సగం స్థలాన్ని ఆక్రమించే భారీ చార్జర్‌తో ఇక పనిలేదు. ఈ స్కూటర్‌లో 450 వాట్ ఆన్‌బోర్డ్ చార్జర్‌ను అమర్చడం వల్ల కేవలం ఒక చిన్న కేబుల్ వెంట తీసుకెళ్తే సరిపోతుంది.

మెయిన్ స్టాండ్, పదేళ్ల వారంటీ ఆఫర్

సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉండటం వల్ల మెయిన్ స్టాండ్ ఇచ్చేందుకు కంపెనీలు వెనకాడుతాయి. మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ పుణ్యమా అని కోనార్క్‌లో సైడ్ స్టాండ్‌తో పాటు మెయిన్ స్టాండ్ కూడా లభిస్తోంది. స్పీడ్ బ్రేకర్లను దాటేటప్పుడు ఇది కింద తగిలే అవకాశమే లేదు. దీనికి తోడు కస్టమర్ల కోసం ఏథర్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సరికొత్త కోనార్క్‌తో పాటు రిజ్వ్తా, 450 మోడళ్లపై 10 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు పొడిగించగల వారంటీని అందిస్తోంది. ఏటా లేదా 10 వేల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మాత్రమే సర్వీసింగ్ చేయిస్తే సరిపోతుంది. బెల్ట్, బ్యాటరీ, బ్రేక్ షూస్ వంటి విడిభాగాల స్థితిని మొబైల్ యాప్ ద్వారానే తెలుసుకునే సదుపాయం ఇచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story