Bajaj Pulsar: గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, పవర్ ఫుల్ ఇంజిన్.. జస్ట్ రూ.1.33లక్షలకే కొత్త పల్సర్లు
Bajaj Pulsar: భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ N160 S , SS మోడళ్లు లాంచ్ అయ్యాయి. కొత్త 4-వాల్వ్ ఇంజిన్, గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో లభిస్తున్నాయి.
Bajaj Pulsar
Bajaj Pulsar: భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ప్రజాదరణ పొందిన పల్సర్ సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లను అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పల్సర్ N160 S, పల్సర్ N160 SS పేర్లతో ఈ బైక్‌లను తీసుకొచ్చింది. పల్సర్ N160 S ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,33,511 గా నిర్ధారించగా, పల్సర్ N160 SS వేరియంట్ ధరను రూ. 1,42,585 గా నిర్ణయించారు. అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ, సరికొత్త ఫోర్-వాల్వ్ ఇంజిన్, పెద్ద ఫ్రంట్ ఫోర్క్స్ వంటి అప్‌డేట్లతో వచ్చిన ఈ బైక్‌లు హీరో, హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీల స్పోర్ట్స్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
మరింత పవర్ఫుల్ 4-వాల్వ్ ఇంజిన్
ఈ కొత్త మోడళ్లలో బజాజ్ చేసిన అతిపెద్ద మార్పు వీటి ఇంజిన్ సామర్థ్యం. N160 S, SS రకాలలో కొత్తగా 164.5cc సింగిల్-సిలిండర్ ఫోర్-వాల్వ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 9,500 rpm వద్ద 18 bhp పవర్‌ను, 8,000 rpm వద్ద 14.4 Nm టాపిక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ సాయంతో బైక్ కేవలం 4.5 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ ప్రకటించింది. పాత 2-వాల్వ్ వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఇంజిన్ మరింత మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
రైడింగ్ మోడ్స్, క్రాల్ టెక్నాలజీ
ఈ బైక్‌లలో ఆయిల్-కూలింగ్, ఎలక్ట్రానిక్ థ్రోటిల్ బాడీ (ఇంటెలిజెంట్ థ్రోటిల్) సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా థ్రోటిల్ రెస్పాన్స్ మార్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా నగరాల్లోని ట్రాఫిక్‌లో క్లచ్ తరచూ నొక్కే పనిలేకుండా, తక్కువ వేగంలో కూడా గేర్ మార్చకుండా సులభంగా ముందుకు సాగేలా 'క్రాల్ టెక్నాలజీ'ని ఇందులో పొందుపరిచారు. N160 SS మోడల్‌లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా లభిస్తుంది.
ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ గూగుల్ మ్యాప్స్ డిస్‌ప్లే
సాంకేతికత విషయానికి వస్తే.. పల్సర్ N160 SS వేరియంట్‌లో గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ సపోర్ట్‌తో కూడిన 5-ఇంచుల TFT స్క్రీన్‌ను అందించారు. భారతీయ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో ఈ తరహా ఫీచర్ రావడం ఇదే తొలిసారి. ఇందులో బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇక N160 S మోడల్‌లో టర్న్-బై-టర్న్ నేవిగేషన్‌తో కూడిన LCD డిస్‌ప్లేను ఇచ్చారు. N160 Sలో సింగిల్-ఛానల్ ABS ఉండగా, N160 SS మోడల్‌లో డ్యూయల్-ఛానల్ ABS లభిస్తుంది.
బలమైన చేసిస్, సస్పెన్షన్స్, రంగులు
రైడర్ల భద్రత, రైడింగ్ కంఫర్ట్ కోసం ఈ బైక్‌ల చేసిస్ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేశారు. ముందు భాగంలో 37mm అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్స్‌ను, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను అమర్చారు. ముందు చక్రానికి 300mm డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. 14 లీటర్ల ఇంధన ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉన్న ఈ బైక్‌లు అట్లాంటిక్ బ్లూ, పెర్ల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంటాయి.




