Bajaj Pulsar 150: పల్సర్ బైక్ కొంటున్నారా? ఆగండి.. ఆగస్టు 24న 2 కొత్త మోడళ్లు దిగుతున్నాయి
Bajaj Pulsar 150: ద్విచక్ర వాహన ప్రియుల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న బజాజ్ పల్సర్ నుంచి రెండు కొత్త మోడళ్లు మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముస్తాబవుతున్నాయి.
Bajaj Pulsar 150
Bajaj Pulsar 150: భారతీయ బైక్ లవర్స్ దశాబ్దాలుగా ఆదరిస్తున్న బజాజ్ పల్సర్ సిరీస్‌లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. నవీకరించిన పల్సర్ 125, పల్సర్ 150 బైక్‌లు ఆగస్టు 24న మార్కెట్లో అధికారికంగా విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ మోడళ్లు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ షోరూమ్‌లకు, డీలర్‌షిప్‌లకు చేరుకోవడంతో వాహన ప్రియుల్లో ఆసక్తి మరింత రెట్టింపైంది. పాత క్లాసిక్ లుక్‌ను కాపాడుతూనే, నేటితరం యూత్‌కు నచ్చేలా మోడర్న్ టచ్ ఇస్తూ ఈ వాహనాలను డిజైన్ చేశారు.
కొత్త ఆయిల్ కూల్డ్ ఇంజిన్, మోడ్రన్ ఛాసిస్
ఈసారి పల్సర్ 150 మోడల్లో పాత ఎయిర్ కూల్డ్ ఇంజిన్ స్థానంలో సరికొత్త ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను జతచేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా బైక్ వేడెక్కకుండా ఉండి, రైడింగ్ పర్ఫార్మెన్స్ గణనీయంగా పెరుగుతుంది. బైక్ ఛాసిస్ విభాగంలో పాత ట్విన్-క్రాడల్ ఫ్రేమ్‌ను పక్కనపెట్టి, దృఢమైన సింగిల్-డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో పాత ట్విన్-షాక్ సస్పెన్షన్ స్థానంలో సరికొత్త మోనోషాక్ యూనిట్‌ను అమర్చడం ద్వారా గతుకుల రోడ్లపై ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది.
డిజిటల్ డిస్ప్లే, అదిరిపోయే ఫీచర్లు
డిజైన్ విషయానికి వస్తే హెడ్‌లైట్ కౌల్, సైడ్ ప్యానెల్స్‌ను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు. అనలాగ్ మీటర్ల స్థానంలో ఫుల్ డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించారు. బైక్ టాప్ వేరియంట్లలో అధునాతన టీఎఫ్టీ డిస్ప్లేను అందించే అవకాశం కనిపిస్తోంది. గేర్ షిఫ్టింగ్ విధానంలో కూడా మార్పులు చేశారు. పాత హీల్-టో గేర్ షిఫ్టర్ స్థానంలో స్పోర్టీ లుక్ ఇచ్చే టో షిఫ్టర్‌ను అమర్చారు. డీలర్‌షిప్‌ల వద్ద కనిపిస్తున్న బైక్స్‌లో సింగిల్-పీస్ సీట్ అమర్చి ఉన్నప్పటికీ, టాప్ ఎండ్ మోడళ్లలో స్ప్లిట్-సీట్ వేరియంట్ అందుబాటులోకి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ధర, బ్రేకింగ్ వివరాలు
ప్రస్తుతం విక్రయమవుతున్న పల్సర్ 125 మోడల్ 11.8 హెచ్‌పీ పవర్ ఇస్తుండగా, పల్సర్ 150 మోడల్ 14 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా రాబోతున్న మోడళ్లలో పవర్ మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ విభాగంలో ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్ కాంబినేషన్‌తో పాటు సింగిల్-ఛానల్ ఏబీఎస్ భద్రతను ప్రాథమికంగా అందిస్తున్నారు. షోరూమ్‌లలో పాత బైక్స్ కొనే ఆలోచనలో ఉన్నవారు కొన్ని రోజులు వేచి చూస్తే సరికొత్త ఫీచర్లతో కూడిన పల్సర్‌ను సొంతం చేసుకోవచ్చు.




