Electric Scooter: సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ రేంజ్.. త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది

Electric Scooter: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి సరికొత్త విప్లవం వచ్చింది.

CR Reddy
Published on: 10 Sept 2026 11:50 AM IST
Beigo X4
X

Beigo X4

Electric Scooter: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి సరికొత్త విప్లవం వచ్చింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ ఐగోవైజ్ మోబిలిటీ బెగో ఎక్స్4 పేరిట వినూత్నమైన త్రీ వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ద్విచక్ర వాహనంలాంటి స్పీడ్, త్రీవీలర్ ఇచ్చే రక్షణ కలయికతో రూపొందిన ఈ స్కూటర్ దీపావళి పండగ నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. దేశీయ రోడ్లపై ప్రయాణాన్ని మరింత సురక్షితం చేసేందుకు ఐగోవైజ్ సంస్థ యాంటీ-టాపుల్ టిల్టింగ్ టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దింది. మలుపులు తిరిగే సమయంలో రైడర్ శరీర కదలికలకు అనుగుణంగా స్కూటర్ పైభాగం సహజంగా వంగుతుంది. వెనుక ఉండే టూ వీలర్ రోడ్డుపై స్ట్రాంగ్ పట్టును, స్థిరత్వాన్ని అందిస్తాయి. వర్షాకాలంలో జారే రోడ్లు, గుంతల మయంగా ఉండే దారుల్లో కూడా కింద పడిపోకుండా బ్యాలెన్స్ నిలబెట్టుకోవడానికి ఈ డిజైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏళ్ల తరబడి జరిపిన పరిశోధనల ఫలితంగా 12 పేటెంట్లతో ఈ సరికొత్త బ్యాలెన్సింగ్ టెక్నాలజీ రూపుదిద్దుకుంది.

ఛార్జింగ్ సమయం, వాహన రేంజ్ వివరాలు

ఐడీసీ సర్టిఫైడ్ లెక్కల ప్రకారం ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో వాడిన ప్రత్యేకమైన హోమ్‌స్విఫ్ట్ 72 వోల్ట్ ఆర్కిటెక్చర్ సహాయంతో ఇంట్లోనే ఉన్న సాధారణ పవర్ సాకెట్ ద్వారా కేవలం 100 నిమిషాల్లో బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల నిత్యం నగరాల్లో ప్రయాణించే వారికి, వస్తువులను ఒకచోట నుంచి మరోచోటికి రవాణా చేసే వారికి సమయం, ఇంధన ఖర్చులు బాగా ఆదా అవుతాయి. ట్రాఫిక్ తోక్కిసలాట ఉండే పట్టణాల్లో సులువుగా ప్రయాణించడానికి ఇది చక్కగా సరిపోతుంది.

మొదటి 300 మందికి బంపర్ ఆఫర్

కంపెనీ ఈ స్కూటర్‌ను మొదట ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్ ద్వారా విక్రయించనుంది. మొదటి 300 మంది వినియోగదారులకు ప్రారంభ ఆఫర్ కింద ఎక్స్-షోరూమ్ ధర రూ.1.25 లక్షలకే అందించనున్నారు. ఆ తర్వాత దీని అసలు ధర రూ.1.56 లక్షలకు పెరుగుతుంది. అంటే ముందస్తుగా బుక్ చేసుకునే వారికి ఏకంగా రూ.31,000 ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దాదాపు 1,000 యూనిట్లను కస్టమర్లకు అందించాలని ఐగోవైజ్ ప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అత్యుత్తమ రక్షణ, సర్టిఫికేషన్లు

ఐదేళ్లకు పైగా పరిశోధనలు చేసి, 50 కి పైగా ప్రోటోటైప్‌లను వివిధ రకాల రోడ్లపై దాదాపు 1.5 లక్షల కిలోమీటర్ల మేర పరీక్షించిన తర్వాతే ఈ వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. బ్రేకింగ్ వ్యవస్థ కోసం ఇందులో ట్రిపుల్ డిస్క్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉపయోగించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ICAT, ARAI నిబంధనలకు లోబడి ఈ స్కూటర్ తయారైంది. ఏఐఎస్-156 బ్యాటరీ సేఫ్టీ ప్రమాణాలను పూర్తిగా అందుకోవడంతో అగ్నిప్రమాదాలు, ఇతర భద్రతాపరమైన సమస్యలకు తావుండదని కంపెనీ స్పష్టం చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story