ఈ కార్లు గాలిలో ఎగరడమే కాదండోయ్, ఆలోచిస్తాయ్ కూడా.. ఫ్యూచర్ వెహికిల్స్ చూస్తే మైండ్ బ్లాంకే..!
Beijing Auto Show 2026: చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ సుమారు 3.8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగుతోంది.
Beijing Auto Show 2026
Beijing Auto Show 2026: టెక్నాలజీ ప్రపంచంలో ఊహకందని మార్పులు వస్తున్నాయి. కేవలం నేలపై పరుగులు తీయడమే కాకుండా, గాలిలో ఎగిరే, సొంతంగా నిర్ణయాలు తీసుకునే కృత్రిమ మేధస్సు కలిగిన కార్లు ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతున్నాయి. బీజింగ్ ఆటో షో 2026 వేదికగా ఆవిష్కృతమైన ఈ సరికొత్త ఆవిష్కరణలు వాహన రంగ భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. ఆ అద్భుతాలేమిటో ఓసారి చూద్దాం..
చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమైన ఈ మెగా ఈవెంట్ సుమారు 3.8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగుతోంది. ఇందులో 1,450కి పైగా వాహనాలను ప్రదర్శించగా, 181 అంతర్జాతీయ ఆవిష్కరణలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఎగిరే వాహనాలు, డ్రైవర్ అవసరం లేని కార్లు ఈ ప్రదర్శనలో హైలైట్‌గా నిలిచాయి.
ఎక్స్‌పెంగ్ ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్: గాలిలో ప్రయాణం..
ఈ ప్రదర్శనలో అందరినీ ఆశ్చర్యపరిచింది ఎక్స్‌పెంగ్ సంస్థ రూపొందించిన మాడులర్ వాహనం. ఇది సాధారణ కారుగా రోడ్లపై వెళ్లడమే కాకుండా, అవసరమైనప్పుడు విడిపోయే ఫ్లయింగ్ మాడ్యూల్ ద్వారా గాలిలో ఎగురుతుంది. పట్టణ ట్రాఫిక్ సమస్యలకు ఇది భవిష్యత్తులో సరైన పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు.
గీలీ రోబోటాక్సీ: స్టీరింగ్ లేని ప్రయాణం..
డ్రైవర్ ప్రమేయం లేకుండా ప్రయాణించే టెక్నాలజీని గీలీ సంస్థ పరిచయం చేసింది. ఈ కారులో అసలు స్టీరింగ్ వీలే ఉండదు. సెన్సార్ల ఆధారంగా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ గమ్యాన్ని చేరుతుంది. వచ్చే ఏడాది నాటికి దీనిని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అవతార్ విజన్ ఎక్స్‌పెక్ట్రా, బీవైడీ డెంజా..
అవతార్ సంస్థ తన సరికొత్త ఎలక్ట్రిక్ గ్రాండ్ టూరర్‌ను ప్రదర్శించింది. ఇది 5.8 మీటర్ల పొడవుతో ఒక లగ్జరీ గదిలా కనిపిస్తుంది. మరోవైపు, బీవైడీ డెంజా కారు కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా నింపుకునే అద్భుతమైన ఛార్జింగ్ సాంకేతికతను కలిగి ఉంది.
షావోమీ ఎస్‌యూ7 అల్ట్రా: స్మార్ట్ కారు..
షావోమీ రూపొందించిన ఈ కారు మీ ఇంటిలోని పరికరాలతో అనుసంధానమై ఉంటుంది. ఇది డ్రైవింగ్ చేసేటప్పుడే మీ కోసం రెస్టారెంట్ బుకింగ్ చేయగలదు. ఇంటికి వెళ్ళేలోపే ఎయిర్ కండిషనింగ్‌ను ఆన్ చేయగలదు.




