Budget SUVs in India 2026: బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో అదరగొడుతున్న ఎస్‌యూవీలు మీకోసం..!

Budget SUVs in India 2026: రూ. 12 లక్షల లోపు ధరలోనే అత్యుత్తమ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్ తో అదరగొడుతోన్న బడ్జెట్ ఎస్‌యూవీల కోసం జనాలు ఎగబడుతున్నారు. టాప్ 4 లిస్ట్ లో ఏమున్నాయో ఓసారి చూద్దాం..

Venkat
Published on: 20 April 2026 2:34 PM IST
Budget SUVs in India 2026
X

Budget SUVs in India 2026

Budget SUVs in India 2026: భారతీయ వాహన మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వాహన ప్రియులు సైతం ఇప్పుడు విలాసవంతమైన పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను కోరుకుంటున్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ప్రముఖ కంపెనీలు రూ. 12 లక్షల లోపు ధరలోనే అత్యుత్తమ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలను సిద్ధం చేశాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కియా సైరోస్: సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్..

కియా సంస్థ తన సరికొత్త సైరోస్ మోడల్‌తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వాహనంలోని హెచ్‌టికె+ వేరియంట్ నుంచే కంపెనీ పానోరమిక్ సన్‌రూఫ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 10.74 లక్షలుగా ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. 12.3 అంగుళాల అతిపెద్ద స్క్రీన్, వైర్‌లెస్ కనెక్టివిటీ, వెనుక వైపు వాలుగా ఉండే సీట్లు దీని ప్రత్యేకతలు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ: భద్రతతో పాటు విలాసం..

మహీంద్రా నుంచి వచ్చిన ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ ప్రస్తుతం యువతను బాగా ఆకట్టుకుంటోంది. దీనిలోని రెవ్‌ఎక్స్ ఏ వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 11.17 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ 6 ఎయిర్‌బ్యాగులు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్‌ను ఇందులో అమర్చారు. 131 హెచ్‌పీ శక్తిని ఇచ్చే టర్బో పెట్రోల్ ఇంజిన్ దీనికి అదనపు బలం.

టాటా నెక్సాన్: నమ్మకమైన ప్రయాణం..

బలమైన బాడీ, 5 స్టార్ భద్రతా రేటింగ్ కలిగిన టాటా నెక్సాన్ ఇప్పుడు పానోరమిక్ సన్‌రూఫ్‌తో మెరుస్తోంది. క్రియేటివ్+ పిఎస్ వేరియంట్ ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. రూ. 11.32 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ వాహనం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉంది. వాయిస్ కమాండ్ ద్వారా పనిచేసే సన్‌రూఫ్ దీనిలోని ప్రత్యేక ఆకర్షణ.

ఎంజీ ఆస్టర్: ఐరోపా తరహా లగ్జరీ..

తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఎంజీ ఆస్టర్ సరైన ఎంపిక. దీనిలోని షైన్ వేరియంట్ నుంచి పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తోంది. దీని ధర రూ. 11.34 లక్షల వద్ద ఉంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, భారీ ఊఫర్స్, విశాలమైన ఇంటీరియర్ ఈ ఎస్‌యూవీని ప్రీమియం విభాగంలో నిలబెట్టాయి.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి ఈ నాలుగు వాహనాలు ప్రస్తుతం మార్కెట్లో అత్యుత్తమ ఎంపికలుగా నిలుస్తున్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story