Gas Cylinder: వంటగ్యాస్ కస్టమర్లకు కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
Gas Cylinder: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన, ముఖ్యమైన అప్డేట్ను అందించింది.
Gas Cylinder
Gas Cylinder: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన, ముఖ్యమైన అప్డేట్ను అందించింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లపై లభించే సబ్సిడీ ప్రయోజనం కేవలం అర్హులైన నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చూసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీతో కూడిన ఎల్పీజీ రీఫిల్స్‌కు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేస్తూ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. నకిలీ, డూప్లికేట్ కనెక్షన్లను పూర్తిగా ఏరివేయడమే ఈ సరికొత్త చర్య ప్రధాన ఉద్దేశ్యం.
ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 89.9 శాతం మంది అంటే దాదాపు 27.43 కోట్ల మంది యాక్టివ్ ఎల్పీజీ వినియోగదారులు తమ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వారు మళ్లీ ఎలాంటి కొత్త పనులు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పటివరకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోని వినియోగదారులు మాత్రం అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ ధరకు సిలిండర్ బుక్ చేసుకునే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే సబ్సిడీ రీఫిల్ బుకింగ్‌కు అర్హత లభిస్తుంది.
ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం వినియోగదారులకు ఎన్నో మార్గాలను అందుబాటులో ఉంచింది. సిలిండర్ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చే సిబ్బంది ద్వారా నేరుగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. లేదా నేరుగా మీ సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌కు వెళ్లి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా ఇంటి నుంచే మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు IndianOil ONE, భారత్‌గ్యాస్ వినియోగదారులు HelloBPCL, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు HP PAY యాప్‌లను ఉపయోగించి సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ ఎల్పీజీ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తిగా ఉచితం, దీనికోసం ఎలాంటిరుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఒకవేళ ఎవరైనా వినియోగదారులు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయలేకపోతే, వారికి గ్యాస్ కనెక్షన్ రావడం ఆగదు, వారు ఎల్పీజీ పొందడం కొనసాగించవచ్చు. కాకపోతే వారికి సబ్సిడీ ధర వర్తించదు. మార్కెట్ ధరకు మాత్రమే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అటువంటి వారు OMCల వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, వాట్సాప్ చాట్బాట్లు లేదా ఐవీఆర్ఎస్ ద్వారా తమకు కావాల్సిన 5 కేజీలు లేదా 10 కేజీల సిలిండర్ ఎంపికను తెలియజేయాలి. సబ్సిడీ కోసం ప్రభుత్వం 1800 2333 555 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకుని సబ్సిడీని దక్కించుకోవడం ఉత్తమం.




