Price Hike: బైక్ లవర్లకు ఊహించని షాక్.. రిలీజైన 5 నెలలకే ధర రూ.30,000 పెంచిన కంపెనీ

Price Hike: భారత మార్కెట్లో ప్రీమియం బైక్ ప్రేమికులకు జర్మన్ లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.

CR Reddy
Published on: 13 Sept 2026 10:16 AM IST
BMW Bikes
X

BMW Bikes

Price Hike: భారత మార్కెట్లో ప్రీమియం బైక్ ప్రేమికులకు జర్మన్ లగ్జరీ బ్రాండ్ బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రీమియం అడ్వెంచర్ మోటార్ సైకిల్ విభాగంలో విశేష ప్రజాదరణ పొందిన బీఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 450 జిఎస్ మోడల్ కొనుగోలుదారుల జేబులకు చిల్లు పెడుతోంది. భారత మార్కెట్లో ఈ పవర్‌ఫుల్ బైక్ అడుగుపెట్టి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే కంపెనీ దీని ధరలను సవరించింది. మొత్తం మూడు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ బైక్‌పై మోడల్‌ను బట్టి రూ.25,000 నుంచి రూ.30,000 వరకు భారం పడింది. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, అంతర్జాతీయంగా ఈ మోడల్‌కు ఊహించని రీతిలో డిమాండ్ పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

వేరియంట్‌ల వారీగా కొత్త రేట్ల వివరాలు

ధరల సవరణ తర్వాత ఈ బైక్ బేస్ వేరియంట్ ధర రూ.25,000 పెరిగింది. ఇదివరకు రూ.4.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్న ప్రారంభ ధర కాస్తా ఇప్పుడు రూ.4.95 లక్షలకు చేరింది. ఇక మిడ్-స్పెసిఫికేషన్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ పై కూడా రూ.25,000 పెంచడంతో, దీని పాత ధర రూ.4.90 లక్షల నుంచి రూ.5.15 లక్షలకు ఎగబాకింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ టాప్-ఎండ్ మోడల్ అయిన 'జిఎస్ ట్రోఫీ' వేరియంట్‌పై గరిష్టంగా రూ.30,000 భారం పడింది. అధునాతన ఈజీ రైడ్ క్లచ్, స్పోర్ట్ సస్పెన్షన్ కలిగిన ఈ టాప్ మోడల్ పాత ధర రూ.5.30 లక్షలు కాగా, ఇప్పుడు రూ.5.60 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.

ప్రపంచం మొత్తానికీ మన భారతే తయారీ కేంద్రం

ఈ బైక్ వెనుక ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. బీఎమ్‌డబ్ల్యూ సంస్థ ఈ పవర్ఫుల్ ఎఫ్ 450 జీఎస్ బైక్‌ను ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే తయారు చేస్తోంది. చెన్నై సమీపంలో ఉన్న ప్లాంట్ లో ఉత్పత్తి అవుతున్న ఈ మోడల్స్ ఐరోపా సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 500 సీసీ లోపు ఉన్న అడ్వెంచర్ బైకులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో సప్లై చెయిన్ సమస్యలు, ముడిసరుకుల ధరలు పెరగడం, రూపాయి మారకం విలువ తగ్గడం వంటి ప్రతికూలతల వల్ల కంపెనీ ఇంత త్వరగా ధరలు పెంచక తప్పలేదు.

ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్సులో మార్పు ఉందా?

ధరలు భారీగా పెరిగినప్పటికీ, బైక్ టెక్నికల్ అంశాల్లో గానీ, ఇంజిన్ స్పెసిఫికేషన్లలో గానీ కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 420 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ కలదు. ఇది 48 బిహెచ్‌పి పవర్, 43 ఎన్ఎమ్ టార్క్‌ను సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేలా 6.5 అంగుళాల కలర్ టిఎఫ్‌టి స్క్రీన్, రైన్, రోడ్, ఎండ్యూరో అనే మూడు రైడింగ్ మోడ్స్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు యథావిధిగా అందుబాటులో ఉన్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.