BSA: రైడింగ్ లవర్లకు పండగలాంటి వార్త.. బీఎస్ఏ నుంచి రెండు అదిరిపోయే ఎడిషన్లు
BSA: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ బీఎస్ఏ భారతీయ మార్కెట్లోకి తన గోల్డ్ స్టార్ 650 శ్రేణిని మరింత విస్తరించింది.
BSA Gold Star 650
BSA: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ బీఎస్ఏ భారతీయ మార్కెట్లోకి తన గోల్డ్ స్టార్ 650 శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కంపెనీ తాజాగా రెండు కొత్త ఎడిషన్లను అధికారికంగా విడుదల చేసింది. బ్రూక్ ల్యాండ్స్ బ్లాక్ లిగేసి ఎడిషన్ అలాగే బర్మింగ్‌హామ్ బ్లూ ఎడిషన్ పేరుతో ఈ కొత్త బైకులను మార్కెట్లోకి తెచ్చారు. క్లాసిక్ రెట్రో డిజైన్‌ను ఇష్టపడే బైక్ రైడర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక ఎడిషన్లను అత్యంత ప్రీమియం ఫినిషింగ్‌తో తీర్చిదిద్దారు.
బ్రిటన్‌లోని చారిత్రాత్మక బ్రూక్‌ల్యాండ్స్ రేసింగ్ సర్క్యూట్ స్ఫూర్తితో బ్రూక్‌ల్యాండ్స్ బ్లాక్ ఎడిషన్‌ను రూపొందించారు. 1937లో ఇదే సర్క్యూట్లో బీఎస్ఏ రైడర్ వాల్ హ్యాండ్లీ రికార్డు సృష్టించి గోల్డ్ స్టార్ బ్యాడ్జ్ సాధించారు. ఈ డార్క్ బ్లాక్ కలర్ బైక్‌కు క్రోమ్ ఫినిష్ ఫెండర్లు, ఫ్యూయల్ ట్యాంక్‌పై గోల్డెన్ పిన్స్ట్రైపింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మరోవైపు బర్మింగ్‌హామ్ బ్లూ ఎడిషన్ సంస్థ పుట్టిన గడ్డైన బర్మింగ్‌హామ్ నగరానికి నివాళిగా నిలుస్తుంది. డార్క్ బ్లూ పెయింట్ స్కీమ్, పెటినేటెడ్ సిల్వర్ సైడ్ ప్యానెల్ బ్యాడ్జ్‌లతో ఇది మోడర్న్ లుక్‌లో కనిపిస్తుంది.
ఈ రెండు మోటార్ సైకిళ్లలోనూ నమ్మకమైన గోల్డ్ స్టార్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించారు. ఇందులో 652 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ శక్తివంతమైన ఇంజన్ సుమారు 45 హార్స్పవర్ శక్తిని, 55 ఎన్ఎమ్ టార్గెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించే ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతిని ఇది రైడర్లకు ఇస్తుంది. అంతేకాకుండా బైక్‌లో బ్రెంబో బ్రేకులు, డ్యూయల్-చానెల్ ఏబీఎస్, వైర్-స్పోక్ వీల్స్ వంటి అత్యాధునిక ప్రీమియం ఫీచర్లు పొందుపరిచారు.
దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైకులు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ షోరూమ్ ధరల విషయానికి వస్తే బర్మింగ్‌హామ్ బ్లూ ఎడిషన్ రూ.3,55,950 ఉండగా, బ్రూక్‌ల్యాండ్స్ బ్లాక్ లిగేసి ఎడిషన్ ధర రూ.3,64,950గా నిర్ణయించారు. కస్టమర్ల నమ్మకంకోసం కంపెనీ అద్భుతమైన ఓనర్షిప్ అస్యూరెన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. దీని కింద 4 సంవత్సరాలు లేదా 50 వేల కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీ, 6 సంవత్సరాల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ, 8 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అలాగే దేశవ్యాప్తంగా 450కి పైగా సర్వీస్ సెంటర్ల ప్రయోజనం లభిస్తుంది.




