Festive Offers: దీపావళికి కొత్త కారు లేదా బైక్ కొంటున్నారా? ఈ 6 సింపుల్ టిప్స్‌తో రూ.వేలు ఆదా
Festive Offers: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆటోమొబైల్ మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు.
Diwali Car Buying
Festive Offers: పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆటోమొబైల్ మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. దీపావళి సమయంలో కొత్త కార్లు అలాగే బైక్‌లు కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. ఆటో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అయితే ప్రకటనలు చూసి తొందరపడి నిర్ణయం తీసుకుంటే జేబుకు చిల్లు పడడం ఖాయం. షోరూమ్‌కు వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలపై అవగాహన ఉంటే వేల రూపాయలు సులభంగా ఆదా చేసుకోవచ్చు.
ధరల పోలిక, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రయోజనం
ఒకే మోడల్ కారు కొనుగోలు చేసేటప్పుడు ఒకే షోరూమ్‌ను నమ్ముకోకూడదు. మీ నగరంలోని కనీసం మూడు వేర్వేరు డీలర్ల దగ్గరకు వెళ్లి ఆన్-రోడ్ ధరల కోటేషన్ తీసుకోవాలి. దీనివల్ల ఏ డీలర్ తక్కువ ధర ఇస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే వాహనంతో పాటు డీలర్ ఇచ్చే ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాలసీబజార్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రేట్లు చెక్ చేసి బయట నుంచి తక్కువ ధరకు ఇన్సూరెన్స్ తీసుకుంటే రూ.10వేల నుంచి రూ.40వేల వరకు ఆదా చేసుకోవచ్చు.
లోన్ వడ్డీ రేట్లు, అదనపు యాక్సెసరీల కోత
బ్యాಂಕ್ లోన్ తీసుకుని వాహనం కొనేటప్పుడు డీలర్ చెప్పే బ్యాంకుకే పరిమితం కాకుండా సొంతంగా వడ్డీ రేట్లను సరిపోల్చాలి. సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు. ఇక షోరూమ్‌లో కార్లతో పాటు బలవంతంగా అంటగట్టే యాక్సెసరీ కిట్లు, మ్యాట్లు, మడ్ ఫ్లాప్‌ల కోసం వేల రూపాయలు వసూలు చేస్తుంటారు. అవసరం లేని వస్తువులను తొలగించుకోవడం ద్వారా అదనపు ఖర్చును తగ్గించుకోవచ్చు.
ఎన్సీబీ డిస్కౌంట్లు, డెలివరీకి ముందు పీడీఐ తనిఖీ
పాత కారు మారుస్తుంటే నో-క్లెయిమ్ బోనస్ (NCB) బదిలీ చేయించుకోవడం ద్వారా ఇన్సూరెన్స్‌లో భారీ తగ్గింపు పొందవచ్చు. ఉద్యోగ రీత్యా లభించే కార్పొరేట్ డిస్కౌంట్ల గురించి కూడా అడగడం మంచిది. ఇవన్నీ ఒకెత్తైతే, షోరూమ్ నుంచి కారు ఇంటికి తెచ్చే ముందు ప్రీ-డెలివరీ ఇన్స్పెక్షన్ (PDI) చేయడం చాలా ముఖ్యం. పగటి పూట కారు బాడీ, పెయింట్, ఇంజిన్ నంబర్ సరిగ్గా ఉన్నాయో లేదో పూర్తిగా పరిశీలించి అప్పుడు మాత్రమే తుది చెల్లింపులు చేయాలి.




