Summer Car Care : ఎండ తీవ్రతకు కార్ బ్రేకులు ఎందుకు ఫెయిల్ అవుతాయి?
Summer Car Care : ఎండల కాలంలో కార్లలో లాంగ్ ట్రిప్స్ వెళ్లేవారు బ్రేక్ ఫెయిల్యూర్ ప్రమాదాల బారిన పడకుండా బ్రేక్ ఆయిల్, బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ రొటేటర్లను ముందే తనిఖీ చేసుకోవడం అత్యంత అవసరం.
Car Safety Tips
Summer Car Care : వేసవి కాలంలో ఎండ తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల పైనే నమోదవుతుంటుంది. ఇలాంటి సమయంలో కారును ఆపడానికి లేదా వేగాన్ని తగ్గించడానికి మనం బ్రేక్ పెడల్‌ను నొక్కినప్పుడు, బ్రేక్ ప్యాడ్స్, డిస్క్ మధ్య విపరీతమైన ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల భారీగా వేడి పుడుతుంది. శీతాకాలంలో లేదా సాధారణ రోజుల్లో ఈ వేడి గాలిలో కలిసిపోతుంది కానీ, వేసవిలో బయట వాతావరణం ముందే వేడిగా ఉండటం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ మరింత వేడెక్కుతుంది. ఆటోమొబైల్ భాషలో దీనిని బ్రేక్ ఫేడ్ అంటారు. ఈ పరిస్థితిలో బ్రేక్ వేసినా కూడా కారు వెంటనే ఆగకుండా ఎక్కువ సమయం తీసుకుంటుంది.
బ్రేక్ ఫ్లూయిడ్ లెవెల్స్ తప్పనిసరిగా చెక్ చేయండి
కారు బ్రేకింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి బ్రేక్ ఆయిల్ ప్రాణధారం లాంటిది. మనం పెడల్ నొక్కినప్పుడు ఈ ఆయిల్ ద్వారానే చక్రాలకు ప్రెజర్ అందుతుంది. అయితే వేసవిలో విపరీతమైన వేడి కారణంగా బ్రేక్ ఆయిల్ లెవెల్ తగ్గిపోవడమే కాకుండా దాని క్వాలిటీ కూడా పాడవుతుంది. బ్రేక్ ఆయిల్ పాతదైతే అది వేడికి ఉడకడం ప్రారంభమై బ్రేక్ లైన్స్‌లో గాలి బుడగలు ఏర్పడతాయి. దీనివల్ల బ్రేక్ పెడల్ పూర్తిగా లూజ్ అయిపోతుంది. అందుకే లాంగ్ ట్రిప్ వెళ్లే ముందు కారు బోనెట్ తెరిచి బ్రేక్ ఆయిల్ లెవెల్ చూసుకోండి. ఆయిల్ రంగు గనుక నల్లగా మారితే వెంటనే మెకానిక్‌తో పాత ఆయిల్ తీయించి కొత్తది పోయించండి.
బ్రేక్ ప్యాడ్ల నుంచి వచ్చే శబ్దాలపై నిఘా ఉంచండి
కారును నిరంతరాయంగా డ్రైవ్ చేయడం, ఎక్కువసార్లు బ్రేకులు వేయడం వల్ల బ్రేక్ ప్యాడ్లు అరిగిపోతుంటాయి. వేసవి కాలంలో ఈ అరుగుదల వేగం రెట్టింపు అవుతుంది. బ్రేక్ ప్యాడ్లు చాలా పల్చగా మారిపోతే అవి డిస్క్‌ను గట్టిగా పట్టుకోలేవు. ఫలితంగా అత్యవసర సమయాల్లో బ్రేకులు అస్సలు పడవు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ వేసిన ప్రతిసారీ చీం-చీం అని వింత శబ్దం వస్తున్నా లేదా ఇనుము ముక్కలు ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు అనిపించినా, మీ కారు బ్రేక్ ప్యాడ్లు పూర్తిగా అరిగిపోయాయని అర్థం చేసుకోవాలి. ట్రిప్‌కు వెళ్లే ముందే వీటిని కొత్త వాటితో రీప్లేస్ చేయడం మంచిది.
డిస్క్, రొటేటర్ల ఫిట్‌నెస్ పరిశీలించండి
చాలామంది కారు యజమానులు బ్రేక్ ప్యాడ్లను సమయానికి మారుస్తారు కానీ, బ్రేక్ డిస్క్ (రొటేటర్స్) స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. విపరీతమైన వేడి, నిరంతర ఘర్షణ వల్ల ఇనుముతో తయారయ్యే ఈ డిస్క్ ప్లేట్లు కొన్నిసార్లు వంగిపోతాయి లేదా వాటిపై సన్నని పగుళ్లు వస్తాయి. హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు మీరు బ్రేక్ వేస్తే కారు స్టీరింగ్ వీల్ లేదా బ్రేక్ పెడల్ విపరీతంగా వణుకుతున్నట్లు అనిపిస్తే, అది డిస్క్ పాడైపోయిందనడానికి స్పష్టమైన సంకేతం. ఘాట్ రోడ్లు, కొండ ప్రాంతాలు లేదా హైవేలపై ప్రయాణించే ముందు డిస్క్ రొటేటర్లను మెకానిక్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవడం వల్ల పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.




