Car Delivery Tips : కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ నుంచి ఇంటికి తెచ్చేముందు ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి
Car Delivery Tips : కొత్త కారును షోరూమ్ నుంచి డెలివరీ తీసుకునే ముందు చేయాల్సిన ప్రీ-డెలివరీ ఇన్‌స్పెక్షన్ (PDI), 5 ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
Car Delivery Tips
Car Delivery Tips : సొంతంగా ఒక కొత్త కారును కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో సంతోషకరమైన క్షణం. అయితే ఆ సమయంలో ఉండే ఆనందం, ఉత్సాహంలో చాలా మంది కస్టమర్లు కొన్ని ప్రాథమిక, అత్యంత ముఖ్యమైన తనిఖీలను చేయడం మర్చిపోతుంటారు. దీనివల్ల కారును ఇంటికి తెచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడటమే కాకుండా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే షోరూమ్ నుంచి వాహనాన్ని బయటకు తీసేముందు ప్రీ-డెలివరీ ఇన్‌స్పెక్షన్(PDI) చేయడం చాలా అవసరం.
ఎక్స్టీరియర్ నిశితంగా పరిశీలించండి
కారును డెలివరీ తీసుకునేటప్పుడు మొదటగా చేయాల్సిన పని కారు ఎక్స్టీరియర్ క్షుణ్ణంగా పరిశీలించడం. కారు బాడీ, పెయింట్, బంపర్లు, హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు, అద్దాలను అన్ని కోణాల నుంచి సరిచూసుకోవాలి. ఎక్కడైనా చిన్న డెంట్స్, స్క్రాచెస్, పెయింట్ షేడ్ మారడం లేదా రిపేర్ చేసిన గుర్తులు ఉన్నాయేమో గమనించాలి. ఎందుకంటే ఫ్యాక్టరీ నుంచి షోరూమ్‌కు రవాణా చేసే సమయంలో కొన్నిసార్లు వాహనాలకు స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
కేబిన్ లోపల అన్ని ఫీచర్లను టెస్ట్ చేయండి
కారు ఎక్స్టీరియర్ చూసిన తర్వాత లోపల కూర్చుని అన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్లను ఒకదాని తర్వాత ఒకటి ఆపరేట్ చేసి చూడాలి. ఏసీ సిస్టమ్ సరిగ్గా కూలింగ్ ఇస్తోందా లేదా, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆన్ అవుతోందా, అన్ని బటన్లు, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ఇంటీరియర్ లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా అనేది నిర్ధారించుకోవాలి. వీటితో పాటు సీట్లు, డోర్ ట్రిమ్స్, డ్యాష్‌బోర్డ్‌పై ఎలాంటి మరకలు, గీతలు లేదా డ్యామేజీలు లేకుండా చూసుకోవడం ముఖ్యం.
టైర్లు, బ్యాటరీ పై లుక్కేయండి
కారు టైర్ల కండిషన్‌ను కూడా తప్పకుండా చెక్ చేయాలి. వాహనానికి ఉన్న అన్ని టైర్లు ఒకే కంపెనీకి చెందినవి, ఒకే మోడల్‌వి అవునో కాదో చూసుకోవాలి. అలాగే బ్యాటరీ కండిషన్ సరిగ్గా ఉందో లేదో డీలర్‌ను అడిగి తెలుసుకోవాలి, లేదంటే భవిష్యత్తులో స్టార్టింగ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు కారులో ఫ్యూయల్ లెవెల్ ఎంత ఉందో చూడాలి. చాలా సందర్భాలలో షోరూమ్ వాళ్లు చాలా తక్కువ ఇంధనంతో కారును డెలివరీ ఇస్తారు, దీనివల్ల షోరూమ్ బయటకు రాగానే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
డాక్యుమెంట్లు,నెంబర్ల వెరిఫికేషన్
కారు తాళాలు చేతికి తీసుకునే ముందే ఇన్సూరెన్స్ పేపర్లు, ఇన్వాయిస్ బిల్లు, ఆర్సీకి సంబంధించిన పత్రాలు, వారంటీ బుక్, ఇతర ముఖ్యమైన కాగితాలను జాగ్రత్తగా చదవాలి. అన్నింటికంటే ముఖ్యంగా, కారుపై ముద్రించి ఉండే ఇంజన్ నెంబర్, ఛాసిస్ నెంబర్లను, మీకు ఇచ్చిన డాక్యుమెంట్లలో ఉన్న నెంబర్లతో సరిపోల్చాలి. ఈ నెంబర్లలో ఒక్క అక్షరం మారినా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ సమయంలో లేదా లీగల్ పరంగా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
డెలివరీకి ముందే చిన్న టెస్ట్ డ్రైవ్
అన్నీ సజావుగానే ఉన్నాయనిపించినా, షోరూమ్ నుంచి కారును ఫైనల్‌గా డెలివరీ తీసుకునే ముందు డీలర్ సమక్షంలో ఒక చిన్న టెస్ట్ డ్రైవ్ చేయడం చాలా ఉత్తమం. ఇలా డ్రైవ్ చేయడం వల్ల కారు బ్రేకులు, స్టీరింగ్, క్లచ్, గేర్‌బాక్స్, సస్పెన్షన్ పనితీరు ఎలా ఉందో మీకు ప్రాక్టికల్‌గా అర్థమవుతుంది. డ్రైవింగ్ సమయంలో ఏదైనా అసాధారణ శబ్దం లేదా వైబ్రేషన్ వస్తే వెంటనే డీలర్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. కొత్త కారు కొనడం అనేది ఒక పెద్ద పెట్టుబడి కాబట్టి, డెలివరీ సమయంలో కేటాయించే ఈ కొన్ని నిమిషాల సమయం మిమ్మల్ని భవిష్యత్తు ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.




