Car Insurance: కార్ యాక్సిడెంట్ అయితే ఈ పార్ట్స్ దెబ్బతినకూడదు.. లేదంటే జేబు ఖాళీ అంతే
Car Insurance: కారుకు చిన్నపాటి ప్రమాదం జరిగినా కొన్ని విడిభాగాల రిపేర్ ఖర్చు భారీగా ఉంటుంది. బంపర్, హెడ్లైట్లు, విండ్‌షీల్డ్, టైర్లు, ఇంజిన్ వంటి పార్ట్స్ పాడైతే జేబుకు చిల్లు పడుతుంది.
Car Insurance
Car Insurance: కారు నడుపుతున్నప్పుడు చిన్నపాటి గీతలు లేదా డెంట్లు పడటం చాలా సాధారణమైన విషయమే. అయితే కొన్నిసార్లు జరిగే పెద్ద ప్రమాదాల కారణంగా కారు బాగుచేయించే ఖర్చు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కారులోని కొన్ని అత్యంత విలువైన విడిభాగాలు దెబ్బతిన్నప్పుడు రిపేర్ బిల్లు తడిసిమోపెడు అవుతుంది. అటువంటి సందర్భాలలో సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగి ఉండటం పెద్ద ఆర్థిక భారం నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఏయే పార్ట్స్ రిపేర్ లేదా మార్చడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుందో ముందుగా తెలుసుకోవడం ఎంతో అవసరం.
బంఫర్లు అలాగే బాడీ పార్ట్స్
రోడ్డుపై వెళ్లేటప్పుడు జరిగే ఢీకొనడంలో ముందుగా కారు బాహ్య భాగాలు దెబ్బతింటాయి. బంపర్లు, ఫెండర్లు, బోనెట్‌లు, డోర్లు, టెయిల్గేట్లు సులభంగా విరిగిపోవడం లేదా నలగడం జరుగుతుంది. కేవలం చిన్న డెంట్ అయితే సాధారణ బాడీ షాప్‌లో బాగు చేయవచ్చు. కానీ నష్టం తీవ్రంగా ఉంటే మొత్తం పార్ట్‌ను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. దీనికి విడిభాగం ఖర్చుతో పాటు పెయింటింగ్, లేబర్ ఛార్జీలు అదనంగా కలుస్తాయి.
హెడ్లైట్లు, టెయిల్లైట్లు
ఆధునిక కార్లలో లైటింగ్ సిస్టమ్ చాలా ఖరీదైనదిగా మారుతోంది. ముఖ్యంగా సరికొత్త ఎల్ఈడీ అలాగే స్మార్ట్ లైటింగ్ సిస్టమ్స్ వాడుకలోకి వచ్చిన తర్వాత వీటి ఖర్చు మరింత పెరిగింది. ఈ లైట్లలో కేవలం బల్బ్ మాత్రమే కాకుండా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. కాబట్టి ప్రమాద సమయంలో ఇవి పగిలిపోతే రీప్లేస్మెంట్ బిల్లు ఊహించని విధంగా వస్తుంది.
విండ్‌షీల్డ్ గ్లాస్, సెన్సార్లు
ఎదురుగా వచ్చే వాహనాల నుంచి రాయి తగలడం లేదా ఇతర కారణాల వల్ల విండ్‌షీల్డ్ పగిలిపోయే ప్రమాదం ఉంది. పగుళ్లు పెద్దవిగా ఉంటే గ్లాస్‌ను పూర్తిగా మార్చాల్సి వస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రీమియం కార్ల విండ్షీల్డ్లకు కెమెరాలు, సెన్సార్లు అనుసంధానించబడి ఉంటాయి. గ్లాస్ మార్చిన తర్వాత ఆ సెన్సార్లను మళ్లీ రీకాలిబ్రేట్ చేయాల్సి రావడంతో అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది.
అలాయ్ వీల్స్, టైర్లు
పెద్ద గుంతలలో కారు వేగంగా పడినప్పుడు లేదా బలమైన అఘాతం తగిలినప్పుడు టైర్లు, అలాయ్ వీల్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. అలాయ్ వీల్స్ బెండవడం లేదా పగిలిపోవడం జరిగితే వాటిని మార్చడం తప్ప వేరే మార్గం ఉండదు. ఖరీదైన కార్లలో పెద్ద సైజు అలాయ్ వీల్స్, ప్రీమియం టైర్లు ఉండటం వల్ల రిపేర్ ఖర్చు మరింత పెరుగుతుంది.
ఇంజన్, ఇతర అంతర్గత భాగాలు
పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం కేవలం బాహ్య భాగాలకే పరిమితం కాకుండా లోపలి ఇంజిన్, రేడియేటర్, సస్పెన్షన్, ఎయిర్‌బ్యాగ్‌ల వరకు వెళ్తుంది. మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ పార్ట్స్ దెబ్బతిన్నప్పుడు బాగుచేయడానికి వేల నుంచి లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇలాంటి సమయంలో సమగ్రమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఆర్థిక భారాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు కేవలం ప్రీమియం గురించి మాత్రమే కాకుండా అందులో లభించే కవరేజ్ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం.




