BMW Cars: బాస్ అంటే నీలా ఉండాలి.. ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్

BMW Cars: చలికాలంలో సిబ్బంది పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన ఓ చైనా మహిళా వ్యాపారవేత్త.. తన నిబద్ధత గల ఉద్యోగులకు ఏకంగా లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చి రియల్ బాస్ అనిపించుకున్నారు.

Gagan kumar
Published on: 9 Oct 2026 4:11 PM IST
BMW Cars
X

BMW Cars: బాస్ అంటే నీలా ఉండాలి.. ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్

BMW Cars: వ్యాపారంలో లాభాలు వస్తే కేవలం యజమానులే ఆనందించడం సర్వసాధారణం. కానీ, కంపెనీ విజయానికి అసలైన కారణమైన ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారి విజయాల్లో భాగస్వామ్యం చేసుకునే బాస్‌లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఓ చైనా మహిళా వ్యాపారవేత్త తన సిబ్బందిపై ప్రేమను చాటుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చూపిన మానవత్వం నెటిజన్ల చేత రియల్ బాస్ అని ప్రశంసలు కురిపింపజేస్తోంది.

చైనాలో విజయవంతంగా రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్న మా అనే మహిళా యజమాని తన సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది అంకితభావాన్ని ఎప్పుడూ ఎంతో అభినందిస్తుంటారు. అయితే, గతేడాది చలికాలంలో ఉదయం వేళల్లో ఉద్యోగులు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆరుబయట ఎముకలు కొరికే చలిగాలుల్లో ప్రయాణించడం ఆమె గమనించారు.

ముఖ్యంగా తన సంస్థలో ఏడేళ్లుగా ఎంతో నమ్మకంగా, అంకితభావంతో పనిచేస్తున్న లి జై అనే ఉద్యోగి చలికి ముఖం కందిపోయి, చేతులు బిగుసుకుపోయి ఆఫీసుకు రావడాన్ని ఆమె స్వయంగా చూసి తీవ్రంగా చలించిపోయారు. తాను కారులో హాయిగా ప్రయాణిస్తున్నప్పుడు, తన సంస్థ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సిబ్బంది మాత్రం చలిలో ఎందుకు ఇబ్బంది పడాలి? అని ఆమె ఆలోచించారు. కంపెనీ సాధిస్తున్న ప్రతి విజయం వెనుక సిబ్బంది సమిష్టి కృషీ ఉందని భావించిన ఆమె, ఆ విజయ ఫలాలను వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన ఉద్యోగులైన లి జై, లూ యింగ్ యింగ్‌లను నేరుగా ఒక కార్ల షోరూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారికి సుమారు 3 లక్షల యువాన్లు విలువైన సరికొత్త లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్ చేశారు.తమ కష్టాన్ని గుర్తించి, ఇంత పెద్ద బహుమతిని అందిస్తారని ఊహించని ఆ ఉద్యోగులు ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. యజమాని చూపిన ఆప్యాయతకు కంటతడి పెట్టారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఒక మంచి యజమాని ఎలా ఉండాలనేదానికి ఈమనే నిదర్శనం, ఉద్యోగులను ఇలా గౌరవిస్తే కంపెనీలు ఏ స్థాయికైనా వెళతాయి అంటూ నెటిజన్లు ఆ మహిళా వ్యాపారవేత్త గొప్ప మనసును అకాశానికెత్తుతూ అభినందిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.