Citroen: సిట్రోయెన్ భారీ బిజినెస్ ప్లాన్.. భారత మార్కెట్లోకి రాబోతున్న 5 కొత్త మోడళ్లు
Citroen: ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం సిట్రోయెన్ భారతీయ మార్కెట్‌లో తమ ఉనికిని మరింత విస్తరించడానికి, బలమైన పట్టు సాధించడానికి సిద్ధమవుతోంది.
Citroen
Citroen: ఫ్రెంచ్ వాహన తయారీ దిగ్గజం సిట్రోయెన్ భారతీయ మార్కెట్‌లో తమ ఉనికిని మరింత విస్తరించడానికి, బలమైన పట్టు సాధించడానికి సిద్ధమవుతోంది. ఆటోమొబైల్ రంగంలో వస్తున్న పోటీని తట్టుకుని కస్టమర్లను ఆకట్టుకునేందుకు రాబోయే ఏళ్లలో ఏకంగా 5 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. ఈ సంస్థ మాతృ సంస్థ అయిన స్టెల్లాంటిస్ భారతదేశంలో జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల పురోగతి కోసం రూ.4,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి మూడు పూర్తి స్థాయి కొత్త మోడళ్లతో పాటు, ప్రస్తుతం విక్రయిస్తున్న రెండు మోడళ్లను భారీ అప్‌డేట్లతో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అందుబాటు ధరలో రాబోతున్న సిట్రోయెన్ A-SUV
భారతీయ వినియోగదారులు బడ్జెట్ ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సిట్రోయెన్ కంపెనీ ఒక సరికొత్త A-రేంజ్ ఎస్‌యూవీని డిజైన్ చేస్తోంది. ఇది మార్కెట్లో కంపెనీ నుంచి వచ్చే అత్యంత తక్కువ ధర ఎస్‌యూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర C3 హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కారులో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు, రోజువారీ ఇంధన వ్యయాన్ని తగ్గించేందుకు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి మోడల్‌ను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రీమియం ఫీచర్లతో వస్తున్న సిట్రోయెన్ C-SUV, D-MPV
చిన్న ఎస్‌యూవీతో పాటు విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం ఒక సరికొత్త C-సెగ్మెంట్ ఎస్‌యూవీని తీసుకురానున్నారు. ఇది బాసాల్ట్, C3 ఎయిర్‌క్రాస్ కంటే పైస్థాయిలో ఉండనుంది. అలాగే ఎంపీవీ సెగ్మెంట్‌లోకి కూడా అడుగుపెట్టేందుకు సిట్రోయెన్ కసరత్తు చేస్తోంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ మోడల్‌కు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఒక లగ్జరీ D-సెగ్మెంట్ ఎంపీవీని రూపొందిస్తున్నారు. సిట్రోయెన్ వాహనాలు సమర్థవంతమైన సస్పెన్షన్, అత్యుత్తమ ప్రయాణ సౌకర్యానికి ప్రసిద్ధి చెందినందున, ఈ కొత్త ఎంపీవీలోనూ అదే తరహా సౌకర్యాన్ని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ప్రస్తుత కార్లకు సరికొత్త లుక్
నూతన మోడళ్లను తీసుకురావడమే కాకుండా ప్రస్తుతం భారత్‌లో విక్రయిస్తున్న సి3, ఇ-సి3, సి3 ఎయిర్‌క్రాస్, బసాల్ట్ కార్లలో రెండు మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో సరికొత్త ఫీచర్లు, మోడ్రన్ డిజైన్‌తో అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ అప్‌డేటెడ్ కార్లలో కస్టమర్ల డిమాండ్ ఆధారంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అధునాతన ఇంటీరియర్ కేబిన్ టెక్నాలజీ, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను చేర్చనున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ 5 మోడళ్ల రాకతో భారతీయ కార్ల మార్కెట్‌లో సిట్రోయెన్ స్థానం మరింత బలంగా మారనుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




