Citroen: రూ.6.99 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. 330 కిమీ రేంజ్‌తో సిట్రోయెన్ ధమాకా.. సిఎన్‌జి వెర్షన్లు కూడా

Citroen: ప్రముఖ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా తన మోడళ్ల శ్రేణిలో భారీ మార్పులు చేస్తూ కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది.

CR Reddy
Published on: 8 Sept 2026 10:41 AM IST
Citroen
X

Citroen

Citroen: ప్రముఖ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా తన మోడళ్ల శ్రేణిలో భారీ మార్పులు చేస్తూ కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. టర్బో, నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్లతో పాటు సిఎన్‌జి ఆప్షన్లు, మెరుగైన రేంజ్‌తో సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను లాంచ్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. సిట్రోయెన్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌లో యు టర్బో కాంఫర్ట్ ఎడిషన్ పేరుతో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.10.69 లక్షలుగా నిర్ణయించింది. గతంతో పోలిస్తే అతి తక్కువ ధరకే పవర్‌ఫుల్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను కస్టమర్లకు అందించడం ఈ మోడల్ ప్రత్యేకత. దీనికి తోడుగా రూ.11.62 లక్షల ధరకు మ్యాక్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ మోడల్‌లో సిఎన్‌జి ఆప్షన్ కూడా లభిస్తుండటంతో ఇంధన పొదుపు కోరుకునే వారికి ఇది చక్కని ఎంపికగా మారనుంది.

బసాల్ట్ ఎక్స్ వేరియంట్లలో మైలేజ్ ధమాకా

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ మోడల్‌ను సైతం సరికొత్త ఫీచర్లు, వెర్షన్లతో అప్‌గ్రేడ్ చేశారు. దీని ప్రారంభ యు టర్బో వేరియంట్ ధర రూ.9.99 లక్షల నుంచి అందుబాటులోకి వచ్చింది. మ్యాక్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియంట్ ధర రూ.11.34 లక్షలుగా ఉంది. మెరుగైన మైలేజ్, లో మెయింటెనెన్స్ ఖర్చు కోరుకునే ప్రయాణికుల కోసం మ్యాక్స్ వేరియంట్‌లో సిఎన్‌జి ఫీచర్‌ను జత చేశారు. కస్టమర్లు తమ అవసరాలకు తగినట్లుగా పెట్రోల్ లేదా సిఎన్‌జి వెర్షన్లను ఎంచుకునే వెసులుబాటును సంస్థ కల్పించింది.

ఈ-సి3ఎక్స్ ఎక్స్‌టెండెడ్

ఎలక్ట్రిక్ వాహన విభాగంలో సిట్రోయెన్ తన పట్టును మరింత బిగించేందుకు ఈ-సి3ఎక్స్ ఎక్స్‌టెండెడ్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త మోడల్ ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌తో ఏకంగా 330 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. దీని ప్రారంభ ధర రూ.6.99 లక్షలుగా నిర్ణయించారు. బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BaaS) విధానం కింద కిలోమీటరుకు రూ.2.26 చొప్పున ఈఎమ్‌ఐ చెల్లించే వెసులుబాటును కల్పించడం గమనార్హం.

ఏడేళ్ల ఫైనాన్స్ ప్లాన్, లగ్జరీ ఇంటీరియర్స్

కొత్త కార్లను మధ్యతరగతి వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు సిట్రోయెన్ ప్రత్యేకమైన స్టెప్-అప్ ఫైనాన్స్ పథకాన్ని ప్రారంభించింది. గరిష్టంగా ఏడేళ్ల వరకు కాలపరిమితితో రుణాలు పొందే అవకాశం ఉంది. ప్రారంభ సంవత్సరాల్లో నెలకు చాలా తక్కువ ఈఎమ్‌ఐ చెల్లించి, ఆ తర్వాత క్రమంగా పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్ కింద బసాల్ట్ ఎక్స్ మొదటి సంవత్సరం ఈఎమ్‌ఐ రూ.9,999 నుంచి, ఎయిర్‌క్రాస్ ఎక్స్ ఈఎమ్‌ఐ రూ.10,555 నుంచి ప్రారంభమవుతుంది. ఎయిర్‌క్రాస్ కాంఫర్ట్ ఎడిషన్‌లో బెజ్ కలర్ లెదర్ సీట్లు, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు, సాఫ్ట్ టచ్ డాష్‌బోర్డ్ వంటి లగ్జరీ ఫీచర్లను అందించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story