Delhi Vehicle Rules: నవంబర్ 1 నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా? BS6 కారు, పీయూసీసీ లేకపోతే ₹20,000 ఫైన్ పక్కా!

Delhi Vehicle Rules: నవంబర్ 1 నుంచి ఢిల్లీలో ఇతర రాష్ట్రాల బస్సులకు కొత్త కాలుష్య నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహనదారులు ఈ రూల్స్ తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Oct 2026 7:09 PM IST
Delhi Vehicle Rules
X

Delhi Vehicle Rules: నవంబర్ 1 నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా? BS6 కారు, పీయూసీసీ లేకపోతే ₹20,000 ఫైన్ పక్కా!

Delhi Vehicle Rules: చలికాలం దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో పెరిగే వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా శాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకొస్తున్నాయి. 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 31 వరకు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే వాహనాలపై ఆంక్షలు విధించారు. భారత్ స్టేజ్ VI (BS6) ప్రమాణాలకు లోబడి లేని పెట్రోల్, డీజిల్ వాహనాలను నగరం లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులైన గాజీపూర్, రజోక్రీ, కాళింది కుంజ్ తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఏఎన్‌పీఆర్ (ANPR) కెమెరాల ద్వారా తనిఖీలు చేపట్టనున్నారు.

ఏ వాహనాలకు అనుమతి ఉంది? వేటికి లేదు?

అనుమతించే వాహనాలు: ఏ రాష్ట్రానికి చెందినవైనా BS6 పెట్రోల్ లేదా డీజిల్ ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), ఎల్‌ఎన్‌జీ (LNG) వాహనాలు, చెల్లుబాటు అయ్యే పీయూసీసీ (PUCC) ఉన్న వాహనాలు మరియు అత్యవసర సేవల వాహనాలు.

నిషేధించిన వాహనాలు: ఢిల్లీ వెలుపల రిజిస్టరైన BS6 కంటే తక్కువ (BS-III, BS-IV) ప్రమాణాలున్న పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు, నాన్-కంప్లైంట్ ఇంటర్‌స్టేట్ బస్సులు.

తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు:

ఢిల్లీ సరిహద్దు దాటే ముందు డ్రైవర్లు ఆర్సీ (RC), డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ ఇన్సూరెన్స్‌తో పాటు పొల్యూషన్ సర్టిఫికేట్ (PUCC) హార్డ్ కాపీలను దగ్గర ఉంచుకోవాలి. ఢిల్లీ వ్యాప్తంగా "నో పీయూసీసీ.. నో ఫ్యూయల్" నిబంధన అమల్లో ఉన్నందున చెల్లుబాటు అయ్యే పీయూసీసీ లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరు. BS6 వాహనమైనా పీయూసీసీ లేకపోతే ప్రవేశం నిరాకరిస్తారు.

రూ. 20,000 భారీ జరిమానా:

నిషేధం ఉన్నప్పటికీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 115/194(1) కింద ఏకంగా ₹20,000 చలాన్ విధించనున్నారు. అలాగే చెల్లుబాటు అయ్యే పీయూసీసీ లేకపోతే ₹10,000 ఫైన్ పడుతుంది. వాయు కాలుష్యం పెరిగి 'గ్రాప్' (GRAP) స్టేజ్-III అమల్లోకి వస్తే ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్, నోయిడాలలో కూడా ఈ ఆంక్షలు విస్తరిస్తాయి. కాబట్టి ఎయిర్‌పోర్ట్ లేదా నోయిడా ప్రయాణికులు తమ వద్ద నాన్-BS6 వాహనాలు ఉంటే ఢిల్లీ సరిహద్దుల బయటే నిలిపివేసి మెట్రో లేదా క్యాబ్ సర్వీసులను ఉపయోగించుకోవడం ఉత్తమం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్