Denza Z9 GT: లగ్జరీ కార్లకు గట్టి పోటీ.. నవంబర్ 13న భారత రోడ్లపైకి దిగబోతున్న డెంజా జెడ్9 జిటి
Denza Z9 GT: ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం బివైడికి చెందిన ప్రీమియం లగ్జరీ బ్రాండ్ డెంజా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది.
Denza Z9 GT
Denza Z9 GT: ప్రముఖ చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం బివైడికి చెందిన ప్రీమియం లగ్జరీ బ్రాండ్ డెంజా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. నవంబర్ 13, 2026న భారతదేశంలో అధికారికంగా ఎంట్రీ ఇస్తూ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కార్ డెంజా జెడ్9 జిటిని ఆవిష్కరించనుంది. కంపెనీ విడుదల చేసిన తాజా టీజర్‌లో ఈ కారు ఎక్స్‌టీరియర్ స్పోర్టీ లుక్, హైటెక్ కేబిన్ డిజైన్ కనిపించి ఆటోమొబైల్ ప్రియులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
డిఫరెంట్ లుక్.. షూటింగ్ బ్రేక్ డిజైన్
డెంజా జెడ్9 జిటి నాలుగు డోర్లు కలిగిన ప్రత్యేకమైన షూటింగ్ బ్రేక్ ఎలక్ట్రిక్ బాడీ స్టైల్‌లో రానుంది. సాధారణ లగ్జరీ కార్లతో పోలిస్తే ఇది చాలా భిన్నమైన పొడవైన ప్రొఫైల్, అగ్రెసివ్ లుక్‌తో కనిపిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం ఈ తరహా డిజైన్ ఉన్న కార్లు చాలా అరుదుగా ఉన్నాయి. జెడ్9 జిటి మోడల్‌తో పాటు 'డి9' అనే లగ్జరీ ఎంపీవీ (MPV) ని కూడా కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టబోతోంది.
1,156 హెచ్‌పి పవర్.. 600 కిమీ రేంజ్
ఈ ఎలక్ట్రిక్ కారులో ఏకంగా మూడు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లను అందించే అవకాశం ఉంది. ఫ్రంట్‌లో ఒకటి, రియర్ ఆక్సిల్‌పై రెండు మోటార్లు అమర్చి ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో డిజైన్ చేశారు. ఇవి కలిపి ఏకంగా 1,156hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. కేవలం 2.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇందులో అమర్చే 122.5kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దీని ప్రత్యేకమైన రియర్-వీల్ స్టీరింగ్ సహాయంతో కారు క్రాబ్-వాక్ (క్రాస్ మూవ్‌మెంట్) కూడా చేయగలదు.
ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఈ కారులో 1,500kW ఫ్లాష్ ఛార్జర్ సపోర్ట్ టెక్నాలజీని అందించనున్నారు. దీని సాయంతో కేవలం 9 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 97 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే భారత్‌లో ఇలాంటి సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ లభ్యతపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అత్యధికంగా గంటకు 270 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లే ఈ కారు రేంజ్, స్పీడ్ విషయంలో మిగతా లగ్జరీ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
అంచనా ధర.. ప్రత్యేక షోరూమ్‌లు
భారత మార్కెట్లో డెంజా జెడ్9 జిటి ఎక్స్-షోరూమ్ ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే కంపెనీ తేబోతున్న డి9 ఎంపీవీ ధర రూ.80 లక్షల వరకు ఉండవచ్చు. బివైడి కంపెనీ తమ డెంజా కార్ల విక్రయం కోసం భారత్‌లో ప్రత్యేకంగా కొత్త ఎక్స్‌క్లూజివ్ డిజైనర్ షోరూమ్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.




