Automatic Car Driving Tips: మాన్యువల్ నుంచి ఆటోమాటిక్ కారుకు మారుతున్నారా..? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి..
Automatic Car Driving Tips: ప్రస్తుతం చాలామంది ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఆటోమెటిక్ కార్లవైపు చూస్తున్నారు. అయితే, మీరు కూడా ఇలానే ఆలోచిస్తుంటే, ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి.
Automatic Car Driving Tips
Automatic Car Driving Tips: ట్రాఫిక్ కష్టాలను తప్పించుకోవడానికి చాలామంది ఇప్పుడు ఆటోమాటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని నడపడం చాలా సులభం, మాటిమాటికీ గేర్లు మార్చే పనే ఉండదు. అయితే, పాత మాన్యువల్ కార్ల అలవాట్లతోనే వీటిని నడిపితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు కూడా కొత్తగా ఆటోమాటిక్ కారు నడుపుతున్నట్లయితే, రిపేర్ల పేరుతో మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఈ 5 కీలక విషయాలు కచ్చితంగా తెలుసుకోండి.
రెండు పాదాలను ఉపయోగించడం..
చాలామంది చేసే మొదటి అతిపెద్ద పొరపాటు డ్రైవింగ్ సమయంలో రెండు కాళ్లను ఉపయోగించడం. మాన్యువల్ వాహనాల్లో ఎడమ కాలును క్లచ్ కోసం, కుడి కాలును బ్రేక్, యాక్సిలరేటర్ కోసం ఉపయోగిస్తాము. కానీ ఆటోమాటిక్ వాహనాల్లో క్లచ్ అసలే ఉండదు. కొందరు పాత అలవాటు ప్రకారం ఎడమ కాలును బ్రేక్ మీద, కుడి కాలును యాక్సిలరేటర్ మీద ఉంచుతారు. అత్యవసర పరిస్థితుల్లో కంగారుపడి రెండు పెడల్స్ ఒకేసారి నొక్కే ప్రమాదం ఉంది. దీనివల్ల కారు అకస్మాత్తుగా ఆగిపోయి, లోపల ఉన్నవారికి గాయాలు కావచ్చు లేదా వెనుక వస్తున్న వాహనాలు బలంగా ఢీకొట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లప్పుడూ మీ కుడి పాదాన్ని మాత్రమే బ్రేక్, రేస్ కోసం వాడాలి, ఎడమ పాదాన్ని పూర్తిగా పక్కన విశ్రాంతిగా ఉంచాలి.
వాలుగా ఉన్న రోడ్లపై న్యూట్రల్ (N) గేర్ వాడటం..
ఇంధనం ఆదా అవుతుందనే అపోహతో చాలామంది వాలుగా ఉన్న ప్రదేశాల్లో లేదా వంతెనల మీద కారును న్యూట్రల్ మోడ్‌లో ఉంచి నడుపుతారు. ఆటోమాటిక్ కార్లలో ఇది ఏమాత్రం సురక్షితం కాదు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ బ్రేకింగ్ ఆగిపోయి, వాహనంపై మీ నియంత్రణ పూర్తిగా తగ్గిపోతుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. పైగా దీనివల్ల ఇంధనం ఏమీ ఆదా కాకపోగా, ఇంజిన్, టైర్లపై అనవసరమైన భారం పడుతుంది. కాబట్టి, ఎప్పుడూ కారును డ్రైవ్ (D) మోడ్‌లోనే ఉంచి నడపాలి.
కారు నిర్వహణను నిర్లక్ష్యం చేయడం..
సాధారణ కార్లతో పోలిస్తే ఆటోమాటిక్ వాహనాలకు కాస్త ఎక్కువ నిర్వహణ అవసరం. ఈ కార్ల గేర్ బాక్స్ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఇందులో చక్రాలకు శక్తిని బదిలీ చేయడానికి ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని ఉపయోగిస్తారు. భారీ వర్షాలు లేదా వరదల సమయంలో ఈ వ్యవస్థలోకి నీరు చేరితే, లోపలి భాగాలు త్వరగా తుప్పు పడతాయి. నీరు, ఆయిల్ కలిసిపోయి ఒక మందపాటి ద్రవంగా మారి గేర్ బాక్స్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సర్వీసింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం..
కొందరు స్టైల్ కోసం లేదా ఇతరులను దాటి వెళ్లాలనే తొందరలో ఒక్కసారిగా యాక్సిలరేటర్ పూర్తిగా నొక్కేసి వేగంగా దూసుకుపోవాలని చూస్తారు. ఇది ఆటోమాటిక్ గేర్ బాక్స్‌కు బద్ధ శత్రువు లాంటిది. ఇలా తరచుగా చేయడం వల్ల ఇంజిన్, గేర్ బాక్స్, టైర్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. లోపల ఉండే సున్నితమైన భాగాలు త్వరగా అరిగిపోవడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. దీనివల్ల మీ కారు పనితీరు మందగించడమే కాకుండా, దాని జీవితకాలం కూడా గణనీయంగా పడిపోతుంది. స్లోగా రేస్ ఇవ్వడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ మార్చడం మర్చిపోవడం..
ఇంజిన్ సజావుగా పనిచేయడానికి ఆయిల్ ఎంత ముఖ్యమో, ఆటోమాటిక్ గేర్ బాక్స్‌కు ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్ కూడా అంతే ముఖ్యం. ఇది లోపలి భాగాలను చల్లగా ఉంచుతూ, రాపిడి నుంచి కాపాడుతుంది. సాధారణంగా ప్రతి లక్ష నుంచి లక్షా అరవై వేల కిలోమీటర్లకు ఒకసారి దీనిని మార్చాలని నిపుణులు సూచిస్తారు. మీకు గేర్లు మారడంలో ఇబ్బందిగా అనిపించినా, గేర్ బాక్స్ నుంచి వింత శబ్దాలు వస్తున్నా, లేదా యాక్సిలరేటర్ నొక్కిన వెంటనే కారు ముందుకు కదలడానికి సమయం తీసుకుంటున్నా.. వెంటనే ఆ ద్రవాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించి మెకానిక్‌ను సంప్రదించాలి. ఇవి పాటిస్తే మీ ఆటోమాటిక్ కారు ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగుతుంది.




