Driving Tips: వర్షాకాలం కారు టైర్ల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం
Driving Tips: దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో చాలా మంది కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌లు, హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు.
Driving Tips: వర్షాకాలం కారు టైర్ల విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం
Driving Tips: దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో చాలా మంది కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌లు, హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే వర్షంలో కారు నడిపేటప్పుడు డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు వాహనం కూడా మంచి స్థితిలో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా టైర్లలో సరైన గాలి ఒత్తిడి (Tyre Pressure) ఉండటం భద్రతకు కీలకం. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు.
వర్షాకాలంలో టైర్ ప్రెషర్ ఎంత ఉండాలి?
సాధారణంగా చాలా కార్లకు టైర్ ప్రెషర్ 30 నుంచి 35 PSI మధ్య ఉండాలని కంపెనీలు సూచిస్తాయి. అయితే వర్షాకాలంలో రోడ్లు తడిగా ఉండటంతో నిపుణులు సాధారణ ప్రెషర్ కంటే 2 నుంచి 3 PSI తక్కువగా ఉంచాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ కారు టైర్లకు సాధారణంగా 35 PSI అవసరమైతే, వర్షాకాలంలో 31 నుంచి 33 PSI మధ్య ఉంచితే మంచిది. ఇలా చేయడం వల్ల టైర్ రోడ్డును మరింత బలంగా తాకుతుంది. దీంతో వాహనం జారిపడే ప్రమాదం తగ్గి, బ్రేకింగ్ కూడా మెరుగ్గా పనిచేస్తుంది.
ప్రతి కారుకు ఒకే టైర్ ప్రెషర్ ఉండదు
అన్ని కార్లకు ఒకే రకమైన టైర్ ప్రెషర్ సరిపోదు. ప్రతి వాహనం బరువు, టైర్ పరిమాణం, డిజైన్ ఆధారంగా తయారీ సంస్థలు వేర్వేరు PSI విలువలను సూచిస్తాయి. అందుకే టైర్లలో గాలి నింపే ముందు మీ కారు యూజర్ మాన్యువల్ లేదా డ్రైవర్ డోర్ లోపల ఉండే స్టికర్‌పై సూచించిన టైర్ ప్రెషర్‌ను తప్పకుండా పరిశీలించాలి. అదే ప్రమాణాన్ని అనుసరించడం ఉత్తమం.
ఎక్కువ గాలి అయినా.. తక్కువ గాలి అయినా సమస్యే
టైర్లలో అవసరానికి మించి గాలి ఉంటే రోడ్డుతో టైర్‌కు ఉండే పట్టుదల తగ్గుతుంది. తడి రోడ్లపై కారు జారిపోయే ప్రమాదం పెరుగుతుంది. అలాగే వాహనాన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది. మరోవైపు గాలి తక్కువగా ఉంటే టైర్లు త్వరగా అరిగిపోతాయి. ఇంధన వినియోగం పెరుగుతుంది. స్టీరింగ్ తిప్పడం భారంగా అనిపిస్తుంది. అంతేకాకుండా వాహనం సమతుల్యత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రయాణంలో సౌకర్యం కూడా తగ్గుతుంది.
వర్షాకాలంలో టైర్లను తరచూ తనిఖీ చేయండి
వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు, రోడ్ల పరిస్థితులు తరచూ మారుతుంటాయి. దీని ప్రభావం టైర్ ప్రెషర్‌పై కూడా పడుతుంది. అందువల్ల క్రమం తప్పకుండా టైర్లలో గాలి ఒత్తిడిని తనిఖీ చేయడం చాలా అవసరం. ప్రస్తుతం చాలా కొత్త కార్లలో TPMS (Tyre Pressure Monitoring System) అనే సదుపాయం ఉంటుంది. ఇది టైర్లలో గాలి ఒత్తిడి తగ్గినా లేదా పెరిగినా వెంటనే సమాచారం ఇస్తుంది. మీ కారులో ఈ ఫీచర్ లేకపోతే సమీపంలోని పెట్రోల్ బంక్ లేదా సర్వీస్ సెంటర్‌లో తరచూ టైర్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది. సరైన టైర్ ప్రెషర్‌ను నిర్వహించడం వల్ల వర్షాకాలంలో డ్రైవింగ్ మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, కారు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.




